Road Safety World Series 2023: మళ్లీ అలనాటి ఆటగాళ్ల ఆట.. బరిలో పాకిస్థాన్!

by Vinod kumar |
Road Safety World Series 2023: మళ్లీ అలనాటి ఆటగాళ్ల ఆట.. బరిలో పాకిస్థాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: సచిన్ కళాత్మక కవర్‌ డ్రైవ్‌లు.. యువరాజ్ సింగ్ ధనాధన్ సిక్స్‌లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. వాయువేగంతో దూసుకెళ్లే మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్ బంతులు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే సురేశ్ రైనా ఫీల్డింగ్‌ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు..! వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అననున్నారు..! తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. మరోసారి పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు..! రోడ్డు ప్రమాదాల‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తోన్న ఈ టోర్నీ మూడో సీజన్‌కు రంగం సిద్దమైంది.

గత రెండు సీజన్లు భారత్ వేదికగా జరగ్గా.. మూడో సీజన్ ఇంగ్లండ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సారి పాకిస్థాన్ లెజెండ్స్ టీమ్ కూడా బరిలోకి దిగనుంది. తొలి రెండు సీజన్లు భారత్‌లో జరగడంతో పాకిస్థాన్ బరిలోకి దిగలేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేకపోవడంతో పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాలేకపోయింది. ఈ సారి ఆ సమస్య లేకుండా మూడో సీజన్‌ను ఇంగ్లండ్ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 9 జట్లు పాల్గొననున్నాయి. త్వరలోనే ఈ టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 జరగనుండటంతో.. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ టోర్నీని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు వారాల్లోనే ఈ సీజన్‌ను ముగించనున్నారు. 2020లో తొలిసారి ఈ టోర్నీకి తెరలేవగా.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ 2021లో తొలి సీజన్‌ను కొనసాగించగా.. కరోనా క్వారంటైన్ నిబంధనలతో ఆసీస్ తప్పుకుంది. రెండో సీజన్ సెప్టెంబర్ 2022లో జరిగింది. ఈ రెండు సీజన్లలో సచిన్ సారథ్యంలో ఇండియా లెజెండ్స్ టీమ్ విజేతగా నిలిచింది.

ఇండియా లెజెండ్స్ తరుఫున యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు ఆడారు. ఇండియా లెజెండ్స్‌తో పాటు శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటిదాకా ఈ టోర్నీ బరిలోకి దిగగా.. ఇప్పుడు పాకిస్థాన్ చేరింది.

Advertisement

Next Story

Most Viewed