ఢిల్లీ ఆల్‌రౌండ్ షో.. బెంగళూరు జోరుకు బ్రేక్

by Harish |
ఢిల్లీ ఆల్‌రౌండ్ షో.. బెంగళూరు జోరుకు బ్రేక్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీని ఓడించింది. బెంగళూరు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు‌పై 25 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. దీంతో బెంగళూరు తొలి ఓటమి పొందగా.. ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు బెంగళూరు ముందు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతితోనూ మెరిసిన ఢిల్లీ ఛేదనకు దిగిన బెంగళూరును నిర్ణీత ఓవర్లలో 169/9 స్కోరుకే పరిమితం చేసింది. అయితే, మొదట్లో బెంగళూరుకు ఓపెనర్ స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభం అందించింది. ధాటిగా ఆడిన ఆమె ఎడాపెడా బౌండరీలు బాదింది. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. డబ్ల్యూపీఎల్‌ ఆమెకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడుతున్న స్మృతి మంధాన(74) జోరుకు మారిజన్నె కాప్ బ్రేక్ వేసింది. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(36) ఆకట్టుకోగా.. ఓపెనర్ సోఫి డివైన్(23), రిచా ఘోష్(19), వారేహమ్(6), నాడిన్ డి క్లెర్క్(1) నిరాశపరిచారు. ఒక దశలో 150/4 స్కోరుతో బెంగళూరు మెరుగైన స్థితిలోనే ఉన్నా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో జొనాసెన్ 3 వికెట్లతో సత్తాచాటగా.. మారిజన్నె కాప్, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లతో రాణించారు. శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది.

షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టుకు శుభారంభం దక్కలేదు. 28 పరుగులకే ఓపెనర్ మెగ్ లాన్నింగ్(11) వికెట్‌ను కోల్పోయింది. దీంతో షెఫాలీ వర్మ, ఎలీస్ క్యాప్సే దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. షెఫాలీ వర్మ వరుసగా రెండో హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ(50) వరుసగా రెండు సిక్స్‌లు బాది అర్ధ శతకం పూర్తి చేసింది. అయితే, ఆ తర్వాతి బంతికే క్యాచ్ అవుటైంది. జెమీమా రోడ్రిగ్స్(0) డకౌటవ్వగా.. ఎలీస్ క్యాప్సే(46), మారిజన్నె కాప్(32), జొనాస్సెన్(36 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసింది. బెంగళూరులో బౌలర్లలో సోఫి డివైన్, నాడిన్ డె క్లెర్క్ చెరో రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్‌కు ఒక వికెట్ పడగొట్టింది.

సంక్షిప్త స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 194/5(20 ఓవర్లు)

(షెఫాలీ వర్మ 50, ఎలీస్ క్యాప్సే 46, జొనాస్సెన్ 36 నాటౌట్, మారిజన్నె కాప్ 32, సోఫి డివైన్ 2/23, నాడిన్ డె క్లెర్క్ 2/35)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : 169/9(20 ఓవర్లు)

(స్మృలి మంధాన 74, మేఘన 36, జొనాస్సెన్ 3/21, మారిజన్నె కాప్ 2/35, అరుంధతి రెడ్డి 2/38)

Advertisement

Next Story

Most Viewed