రిక్కీ భుయ్ సెంచరీ, మెరిసిన బౌలర్లు.. విజయం దిశగా ఆంధ్ర టీమ్

by Harish |
రిక్కీ భుయ్ సెంచరీ, మెరిసిన బౌలర్లు.. విజయం దిశగా ఆంధ్ర టీమ్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తొలి విజయానికి అడుగు దూరంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో డ్రా, ఓటమి పొందిన ఆంధ్ర టీమ్.. మూడో మ్యాచ్‌లో అసోంపై గెలుపు ముంగిట నిలిచింది. ప్లేట్ విభాగంలో గ్రూపు-బిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అసోం ముందు ఆంధ్ర టీమ్ 363 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి అసోం 81 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్‌లో నేడు చివరి రోజు కాగా.. అసోం ఇంకా 282 పరుగులు వెనకబడి ఉంది. మరో 5 వికెట్లు తీస్తే ఆంధ్ర జట్టుదే గెలుపు. ఓవర్‌నైట్ స్కోరు 147/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర టీమ్ 334/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. కెప్టెన్ రిక్కీ భుయ్(125) సెంచరీతో కదం తొక్కాడు. అతనికి ఇది 16వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. భారత బ్యాటర్ హనుమ విహారి(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. షేక్ రషీద్(40 నాటౌట్) అజేయంగా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యం కలుపుకుని ఆంధ్ర టీమ్.. అసోం ముందు 363 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. రెండో సెషన్‌ ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన అసోంను ఆంధ్ర బౌలర్లు కష్టాల్లోకి నెట్టారు. గిరినాథ్ రెడ్డి 3 వికెట్లు, లలిత్ మోహన్ 2 వికెట్లతో సత్తాచాటారు. దీంతో మూడో రోజును అసోం 81/5తో ముగించింది. కెప్టెన్ రియాన్ పరాగ్(46 బ్యాటింగ్), సుమిత్(6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story