Paris Olympic : ఒలింపిక్స్ వేళ పారిస్‌లో రెచ్చిపోతున్న దొంగలు

by Harish |
Paris Olympic : ఒలింపిక్స్ వేళ పారిస్‌లో రెచ్చిపోతున్న దొంగలు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో ఒకవైపు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతుండగా మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒలింపిక్స్‌ను తిలకించేందుకు వచ్చిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం జికోకు చేదు అనుభవం ఎదురైంది. ట్యాక్సీలో వెళ్తుండగా విలువైన వస్తువులు ఉన్న అతని బ్రీప్ కేసు దొంగతనానికి గురైంది. ఈ మేరకు శుక్రవారం జికో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పారిస్ మీడియా కథనాల ప్రకారం.. 71 ఏళ్ల జికో ఒలింపిక్స్‌ను చూసేందుకు బ్రెజిల్ బృందంలో పారిస్‌కు వచ్చాడు. హోటల్ నుంచి ఓ కార్యక్రమానికి ట్యాక్సీలో వెళ్తుండగా జికో బ్రీప్‌కేసును దొంగలు దోచుకున్నారు. ట్యాక్సీ‌ని ఫాలో అయిన ఓ వ్యక్తి డ్రైవర్‌ దృష్టిని మరల్చగా.. మరో వ్యక్తి వెనుక నుంచి బ్రీప్‌కేసును ఎత్తుకెళ్లాడు. ఆ బ్రీప్ కేసులో డైమండ్ నెక్లెస్, డబ్బు, లగ్జరీ రోలెక్స్ వాచ్ ఉనట్టు తెలుస్తోంది. వాటి విలువ 500,000 యూరోలు(దాదాపు 4.5 కోట్లు) ఉంటుందని అక్కడి మీడియా తెలిపింది. జకో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్టు పేర్కొంది.

మరోవైపు, అర్జెంటీనా ఫుట్‌బాల్ ట్రైనింగ్ క్యాంప్‌లో దొంగతనం జరిగింది. ఒలింపిక్స్‌లో ఈ నెల 24న మొరాకో, అర్జెంటీనా మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా కోచ్ జెవియారో మస్చెరానో మాట్లాడుతూ.. తాము ట్రైనింగ్ కోసం వెళ్లిన సమయంలో దొంగతనం జరిగిందని, దొంగలించిన వస్తువుల్లో మిడ్ ఫీల్డర్ థియోగో అల్మాడా వాచ్ కూడా ఉందని తెలిపాడు. అర్జెంటీనా ప్రతినిధి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.



Next Story