PAK vs AUS : రెండో వన్డేలో పాక్ చేతిలో ఆసిస్ చిత్తు.. 28 ఏళ్ల తర్వాత ఆ మైదానంలో పాక్‌ గెలుపు

by Harish |
PAK vs AUS : రెండో వన్డేలో పాక్ చేతిలో ఆసిస్ చిత్తు.. 28 ఏళ్ల తర్వాత ఆ మైదానంలో పాక్‌ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్ పుంజుకుంది. రెండో వన్డేలో ఆసిస్‌కు షాకిచ్చింది. అడిలైడ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత అడిలైడ్‌లో పాక్ జట్టు గెలుపు రుచి చూసింది. ఇంతకుముందు చివరిసారిగా 1996లో అడిలైడ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసిస్‌ను పాక్ ఓడించింది.

తాజా విజయంతో ప్రస్తుత సిరీస్‌ను ఆ జట్టు 1-1తో సమం చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట బౌలర్లు ఆసిస్‌ను బెంబేలెత్తించారు. పేసర్ హరీస్ రవూఫ్ 5 వికెట్లతో చెలరేగాడు. అతనికితోడు షాహీన్ అఫ్రిది కూడా 3 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. స్మిత్(35) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్(19), జేక్ ప్రేజర్(13), జోష్ ఇంగ్లిస్(18), లబుషేన్(6), మ్యాక్స్‌వెల్(16), కమిన్స్(13) నిరాశపరిచారు.

అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 26.3 ఓవర్లలోనే ఛేదించింది. సైమ్ అయూబ్(82), అబ్దుల్లా షఫీక్(64 నాటౌట్) రెచ్చిపోవడంతో పాకిస్తాన్ విజయం సునాయాసమైంది. పాక్‌ కెప్టెన్ రిజ్వాన్‌‌కు సారథిగా ఇదే తొలి విజయం. అంతేకాకుండా, 2017 తర్వాత ఆసిస్‌ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించిన తొలి పాక్ కెప్టెన్‌గా రిజ్వాన్ నిలిచాడు. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed