యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. రెండో రౌండ్‌లోనే అల్కరాజ్ ఔట్

by Harish |
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. రెండో రౌండ్‌లోనే అల్కరాజ్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో పెను సంచలనం నమోదైంది. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. అతనికి అన్‌సీడ్ ఆటగాడు బొటిక్ వాన్ డె జాండ్‌‌స్చుల్ప్‌ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌‌లో అల్కరాజ్‌ను 1-6, 5-7, 4-6 తేడాతో నెదర్లాండ్స్ ప్లేయర్ బొటిక్ వాన్ డె జాండ్‌‌స్చుల్ప్‌ ఓడించాడు. అల్కరాజ్ వరుసగా మూడు సెట్లు కోల్పోవడం గమనార్హం. 27 అనవసర తప్పిదాలతో అతను మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గి హ్యాట్రిక్ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన అల్కరాజ్‌కు ఈ ఓటమి భారీ షాకే అని చెప్పొచ్చు. మరోవైపు, బొటిక్ వాన్ డె జాండ్‌‌స్చుల్ప్‌ అద్భుత ప్రదర్శనతో అల్కరాజ్‌కు చెక్ పెట్టాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు.

2021 చాంపియన్ మెద్వెదేవ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో మారోజ్సాన్(హంగేరి)పై 6-3, 6-2, 7-6(7-5) తేడాతో నెగ్గాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకా గాఫ్(అమెరికా) జోరు కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో గాఫ్ 3-6, 6-3, 6-3 తేడాతో స్విటోలినా(ఉక్రెయిన్)ను ఓడించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. అలాగే, మాజీ వింబుల్డన్ చాంపియన్ రిబాకినా(కజకిస్తాన్) గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నవోమి ఒసాకా(జపాన్)‌కు రెండో రౌండ్‌లో షాక్ తగిలింది. కరోలినా ముచోవా(చెక్ రిపబ్లిక్) చేతిలో 6-3, 7-6(7-5) తేడాతో ఓడిపోయి నిష్ర్కమించింది. పారిస్ ఒలింపిక్ చాంపియన్ క్వినెన్ జెంగ్(చైనా), 6వ సీడ్ జెస్సికా పెగులా(అమెరికా) టోర్నీలో ముందడుగు వేశారు.

Advertisement

Next Story