సొంతగడ్డపై కివీస్‌కు భారీ షాక్.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసిస్

by Harish |
సొంతగడ్డపై కివీస్‌కు భారీ షాక్.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసిస్
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు భంగపాటు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అక్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితం తేలగా ఆసిస్ 27 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్ణీత ఓవర్లపాటు సాగలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 10.4 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 118 పరుగులు చేసింది. హెడ్(33), మాథ్యూ షార్ట్(27), మ్యాక్స్‌వెల్(20) విలువైన పరుగులు జోడించారు. వర్షం పడటంతో 10.4 ఓవర్ వద్ద అంపైర్లు ఇన్నింగ్స్‌ను నిలిపివేశారు.

ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్‌ను అంపైర్లు 10 ఓవర్లకు కుదించి 126 లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో న్యూజిలాండ్ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్(40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆసిస్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌లో నిలువరించారు. టీ20ల్లో ఆస్ట్రేలియాకు ఇది 100వ విజయం. ఈ నెల 29 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు తెరలేవనుంది.

Advertisement

Next Story

Most Viewed