మళ్లీ రజతం కొల్లగొట్టిన నిషాద్.. పారాలింపిక్స్‌లో 7కు చేరిన భారత్ పతకాలు

by Harish |
మళ్లీ రజతం కొల్లగొట్టిన నిషాద్.. పారాలింపిక్స్‌లో 7కు చేరిన భారత్ పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఆదివారం అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. 200 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కాంస్యం నెగ్గింది. ఈ విశ్వక్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం. ప్రీతి కాంస్యం గెలిచిన కాసేపటికే భారత హైజంపర్ నిషాద్ కుమార్ దేశానికి మరో పతకం అందించాడు. పురుషుల హైజంప్ టీ47 కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలిచాడు. 2.04 మీటర్ల ప్రదర్శనతో పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే, అతనికి ఇది సీజన్ బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. అమెరికా అథ్లెట్ రోడెరిక్ టౌన్‌సెండ్(2.12 మీటర్లు) స్వర్ణం సాధించగా.. తటస్థ అథ్లెట్ జార్జీ మార్గీవ్(2.00 మీటర్లు) కాంస్యం గెలుచుకున్నాడు. నిషాద్‌కు ఇది రెండో పారాలింపిక్ మెడల్. టోక్యో పారాలింపిక్స్‌లోనూ అతను సిల్వర్ మెడల్ సాధించాడు. తాజాగా నిషాద్ గెలిచిన పతకంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 7కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed