అతనే మా హెడ్ కోచ్ : జై షా

by Harish |
అతనే మా హెడ్ కోచ్ : జై షా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌ను వెతికే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లను బోర్డు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. తనతో చర్చలు జరిపారని, తన లైఫ్ స్టైల్‌కు ఆ పదవి సెట్ అవ్వదని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. మరోవైపు, భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ తనతో చెప్పాడని జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలను బీసీసీఐ సెక్రెటరీ జై షా కొట్టిపారేశారు. తానుగానీ, బీసీసీఐగానీ కోచ్ పదవిని ఆఫర్ చేస్తూ ఏ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిని సంప్రదించలేదని తెలిపారు. తాజాగా జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ..‘జాతీయ జట్టు కోసం కోచ్‌ను కనుగొనడం కచ్చితమైన, సమగ్రమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపం, దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన ఉన్న వారి కోసం చూస్తున్నాం.’ అని తెలిపారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైందని, ఆ పదవికి ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాలు కలిగి ఉండాలని చెప్పాడు. భారత క్రికెట్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే వారినే బీసీసీఐ ఎంపిక చేస్తుందని తెలిపారు.

కాగా, హెడ్ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27తో గడువు ముగియనుంది. మరో రెండు రోజుల్లో స్వీకరణ గడువు ముగియనుండగా.. ఎవరెవరు దరఖాస్తు చేశారో ఇంకా బయటకు తెలియలేదు. అయితే, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, చెన్నయ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.



Next Story