రంజీ ట్రోఫీలో శార్దూల్ ఠాకూర్ విధ్వంసం.. తమిళనాడు బౌలర్ల ఊచకోత

by Harish |
రంజీ ట్రోఫీలో శార్దూల్ ఠాకూర్ విధ్వంసం.. తమిళనాడు బౌలర్ల ఊచకోత
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ రంజీ ట్రోఫీలో బ్యాటు ఝుళిపించాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీస్‌లో ముంబై తరపున అతను శతక్కొట్టాడు. అతనితోపాటు తనూష్ కొటియన్(74), ముషీర్ ఖాన్(55) రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆదివారం ఆట ముగిసే సమయానికి 353/9 స్కోరుతో ఆధిపత్య కొనసాగించింది. అయితే, ఒక దశలో ముంబై 106/7 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్ స్కోరు 45/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ముంబైని సాయి కిశోర్ దెబ్బ కొట్టాడు. అతను 6 వికెట్లతో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ ముషీర్ ఖాన్(55) హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుటవ్వగా.. కెప్టెన్ రహానే(19), శ్రేయస్ అయ్యర్(3) నిరాశపరిచారు.

కేవలం 66 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై 150 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, శార్దూల్ ఠాకూర్(104 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు) గొప్ప పోరాట పటిమ కనబరిచాడు. ధాటిగా ఆడిన అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి శతకం బాదాడు. సెంచరీ బాదిన తర్వాత శార్దూల్ సెలబ్రేషన్స్ వైరల్‌గా మారాయి. అతని ప్రదర్శనను ప్రశంసిస్తూ నెటిజన్లు ‘లార్డ్ శార్దూల్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతనితోపాటు కీలక ఇన్నింగ్స్ ఆడిన తనూష్(74 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనితోపాటు తుషార్ దేశ్‌పాండే(17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ముగిసే సరికి 353/9 స్కోరుతో నిలిచిన ముంబై.. తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు తమిళనాడును ముంబై బౌలర్లు 146 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed