ప్రమాదమేమీ లేదు.. మయాంక్ అగర్వాల్‌‌‌ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన కర్ణాటక బోర్డు

by Harish |
ప్రమాదమేమీ లేదు.. మయాంక్ అగర్వాల్‌‌‌ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన కర్ణాటక బోర్డు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. అగర్తల నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో అతను అనారోగ్యం బారినపడ్డాడు. తీవ్ర గొంతు నొప్పితో బాధపడిన మయాంక్ రెండు సార్లు వాంతులు కూడా చేసుకున్నాడు. అప్పటికి ఇంకా విమానం టేకాఫ్ కాకపోవడంతో అతన్ని హుటాహుటిన అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు మయాంక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం వరకు అగర్తలలో కర్ణాటక, త్రిపుర జట్ల మధ్య గ్రూపు మ్యాచ్ జరగగా.. కర్ణాటక విజయం సాధించింది. మ్యాచ్ ముగించుకుని ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏం లేదని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. సూరత్‌ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రైల్వేస్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ దూరంగా ఉంటాడని పేర్కొంది. వైద్యుల నుంచి అప్‌డేట్ వచ్చిన తర్వాత అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లనున్నట్టు చెప్పింది. కాగా, మయాంక్ గైర్హాజరులో రైల్వేస్‌తో మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ నికిన్ జోస్ జట్టును నడిపించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed