ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో గోల్డ్..

by Vinod kumar |   ( Updated:2023-03-30 12:24:25.0  )
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో గోల్డ్..
X

న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఇప్పటికే నీతూ, సావిటీ వరల్డ్ చాంపియన్స్‌గా నిలవగా.. నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్ సైతం భారత్ ఖాతాలో స్వర్ణ పతకాలు చేర్చారు. 50 కేజీల కేటగిరీలో తెలంగాణ బాక్సర్ నిఖత్ 5-0 తేడాతో వియత్నం బాక్సర్ న్గుయెన్ తీ టామ్‌ను చిత్తు చేసింది. దాంతో వరల్డ్ చాంపియన్‌ హోదాను నిలబెట్టుకున్న నిఖత్.. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించింది. మేరీకోమ్ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు స్వర్ణం గెలిచిన రెండో భారత మహిళా బాక్సర్‌గా నిఖత్ రికార్డు సృష్టించింది. 75 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్‌మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్ 5-2 తేడాతో ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ అన్నే పార్కర్‌పై విజయం సాధించి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది.

కాంస్యాన్ని దాటి పసిడి మోత..

గతంలో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలనే పట్టుదలతోనే ప్రతి బౌట్‌లో బరిలోకి దిగింది. మొదటి బౌట్ నుంచి సంచలన ప్రదర్శన చేసిన లవ్లీనా ఫైనల్ బౌట్‌లో అదరగొట్టింది. ఆస్ట్రేలియా ప్రత్యర్థి కైట్లిన్ అన్నే పార్కర్‌ 2-5 తేడాతో విజయం సాధించింది. అయితే, బౌట్‌‌ను లవ్లీనా అంత తేలిగ్గా గెలుచుకోలేదు. మొదటి రౌండ్‌ నుంచే ప్రత్యర్థి నుంచి గట్టి పోటీఎదురైంది. తొలి రౌండ్‌లో ఇద్దరు పరస్పరం పంచ్‌లు మార్చుకున్నారు. అయితే, లవ్లీనా కాస్త ఆధిపత్యం చెలాయించి తొలి రౌండ్‌లో పైచేయి సాధించింది. సెకండ్ రౌండ్‌లో భారత బాక్సర్ బలంగా పుంజుకుని ప్రత్యర్థి పంచుల దాడికి దిగింది.

రౌండ్ ప్రారంభంలోనే రెండు శక్తివంతమైన పంచ్‌లను విసిరింది. ప్రత్యర్థి నుంచి పంచ్‌లను తప్పించుకుంటూ లవ్లీనా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దాంతో రెండో రౌండ్ 4-1తో లవ్లీనా ఆధిపత్యం చెలాయించింది. ఇక, ఆఖరి రౌండ్‌లో పార్కర్ ఎటాకింగ్ దిగగా.. లవ్లీనా తిప్పికొట్టింది. అలాగే, తాను కూడా దూకుడు పెంచి ప్రత్యర్థిపై ఎటాకింగ్ చేసింది. దాంతో మెజార్టీ జడ్జీల మద్దతుతో లవ్లీనా విజేతగా నిలిచింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు ఇదే తొలి స్వర్ణం. 2018, 2019 ఎడిషన్లలో కాంస్యంతోనే సరిపెట్టిన లవ్లీనా ఈ సారి సెమీస్‌ను దాటి ఫైనల్‌కు దూసుకెళ్లడంతోపాటు పసిడి మోత మోగించింది. దాంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన 8f భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది. మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ, నిఖత్‌ జరీన్‌, నీతూ, సావిటీ తర్వాత వరల్డ్ చాంపియన్ హోదాను సొంతం చేసుకుంది.

నాలుగుకు నాలుగు..

టోర్నీలో భారత్ 12 బాక్సర్లతో బరిలోకి దిగింది. అందులో నీతూ(48 కేజీలు), నిఖత్(50 కేజీలు), లవ్లీనా(75 కేజీలు), సావిటీ(81 కేజీలు) ఫైనల్‌కు చేరారు. తుది పోరుకు వెళ్లిన నలుగురు బాక్సర్లు నాలుగు స్వర్ణాలు సాధించడం విశేషం. 2006లో భారత్ నాలుగు స్వర్ణాలతోపాటు మొత్తంగా 8 పతకాలు దక్కించుకుంది. ఆ ఎడిషన్ తర్వాత భారత్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన.

Advertisement

Next Story