'పరిస్థితులను బట్టి ఆడాలి'.. బజ్‌బాల్ ఆటపై ఇషాన్ కిషన్ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
పరిస్థితులను బట్టి ఆడాలి.. బజ్‌బాల్ ఆటపై ఇషాన్ కిషన్ ఆసక్తికర కామెంట్స్
X

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : ప్రతి టెస్టు మ్యాచ్‌లో దూకుడుగా ఆడటం అవసరం లేదని, పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుందని టీమ్ ఇండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. భారత్, విండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు చివరి రోజు వర్షం అంతరాయంతో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. బజ్‌బాల్ ఆటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అలా ఆడాల్సిన అవసరం లేదన్నాడు. ‘పరిస్థితులను బట్టి మనం ఆడాల్సి ఉంటుంది. పిచ్ ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా కీలకం. విండీస్‌లో పిచ్‌లపై అంత సులభంగా పరుగులు చేయలేం.

బంతులు బౌన్స్‌తోపాటు తిరుగుతాయి.కాబట్టి, దూకుడుగా ఆడటం వల్ల ప్రయోజనం ఉండదు. ముందుగా పిచ్‌ను సరిగా అంచనా వేయాలి. ఒకవేళ పిచ్ సహకరిస్తే దూకుడుగా ఆడొచ్చు. టీమ్ ఇండియాలో ఆ విధంగా ఆడే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. ఇంగ్లాండ్ బజ్‌బాల్ క్రికెట్‌ తరహాలో భారత బ్యాటర్లు బ్యాటు ఝుళిపించారు. 24 ఓవర్లలో 181 పరుగులు సాధించింది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Advertisement

Next Story

Most Viewed