శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్‌లు?.. కారణం ఏంటంటే?

by Harish |
శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్‌లు?.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్‌ నిర్వహణ బీసీసీఐకి పెద్ద టాస్క్‌గా మారింది. మార్చి చివర్లో లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియాలో నిర్వహించాలా? లేదా టోర్నీని విదేశాలకు తరలించాలా? అనేది బోర్డుకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో లీగ్ వేదికపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీసీసీఐ సెక్రెటరీ జైషా, శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ హరీన్ ఫెర్నాండో భేటి అయ్యారు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని జై షాను హరీన్ ఫెర్నాండో కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు తోసిపుచ్చాయి. ‘టోర్నీని దేశం బయట నిర్వహించే ఆలోచన లేదు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రం మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వలేమని సరైన కారణం చెబితే మ్యాచ్‌లను వేరే వేదికకు మార్చవచ్చు.’ అని తెలిపాయి. మరోవైపు, టోర్నీని తరలించే అవకాశం లేకపోలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు లీగ్‌ను దేశం బయట నిర్వహించడం బీసీసీఐకి కొత్తేం కాదు. 2009, 2014 ఎన్నికల సమయాల్లో టోర్నీని విదేశంలోనే నిర్వహించింది. 2009 ఎడిషన్ పూర్తిగా సౌతాఫ్రికాలో జరగగా.. 2014 ఎడిషన్ గ్రూపు దశకు యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో భారత్‌లో జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed