శుభారంభం ఎవరిదో?

by Harish |   ( Updated:2024-03-21 19:49:25.0  )
శుభారంభం ఎవరిదో?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌-2024 ప్రారంభానికి వేళైంది. శుక్రవారం నుంచి లీగ్ ప్రారంభకానుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. రెండు బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఓపెనింగ్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టాలనే లక్ష్యంతో ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టబోతున్నాయి.

ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కే బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌తోనే గైక్వాడ్‌కు కఠిన పరీక్ష ఎదురైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కెప్టెన్‌గా అతను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.చెన్నయ్ జట్టులో ఆల్‌రౌండర్ సామర్థ్యం ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోనీ, శార్దూల్ ఠాకూర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉండటం ఆ జట్టుకు ప్రధాన బలం. అలాగే, బౌలింగ్‌లో దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, శార్దూల్ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించనున్నారు. గత సీజన్‌లో సత్తాచాటిన డేవాన్ కాన్వే, బౌలర్ పతిరణ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుకు లోటే. సొంత మైదానం కావడం కూడా సీఎస్కేకు అనుకూలంశం.

మరోవైపు, ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఆర్సీబీ.. ఈ సీజన్‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగళూరులో కూడా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‌ వంటి ప్లేయర్లతో ఆ జట్టు బ్యాటింగ్ దళం బలంగా ఉంది. రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్‌‌లతో కలిపి 7వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. బౌలింగ్ దళాన్ని సిరాజ్ నడిపించనున్నాడు. అల్జారీ జోసెఫ్, మయాంక్ దగర్, ఆకాశ్ దీప్, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లను కలిగి ఉండటంతోపాటు బలాబలాల పరంగా సమతూకంగా కనిపిస్తున్నాయి. మరి, ఏ జట్టు శుభారంభం చేస్తుందో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 31 సార్లు ఎదురుపడగా.. 20 విజయాలతో చెన్నయ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 10 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ నెగ్గింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Advertisement

Next Story