Asian Games 2023: ఆసియా గేమ్స్‌కు భారత ఫుట్‌బాల్ జట్లు.. క్రీడా శాఖ గ్రీన్‌సిగ్నల్

by Vinod kumar |
Asian Games 2023: ఆసియా గేమ్స్‌కు భారత ఫుట్‌బాల్ జట్లు.. క్రీడా శాఖ గ్రీన్‌సిగ్నల్
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత జాతీయ పురుషుల, మహిళల ఫుట్‌బాల్ జట్లు పాల్గొనేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. మన జాతీయ పురుషుల, మహిళల ఫుట్‌బాల్ జట్లు ఆసియా గేమ్స్‌లో పాల్గొంటాయి. ఇటీవల భారత జట్ల ప్రదర్శనను దృష్టిలోకి తీసుకుని క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనలను సడలించింది. ఆసియా క్రీడల్లో మన ఆటగాళ్లు సత్తాచాటి దేశం గర్వపడేలా చేస్తారని నమ్ముతున్నా.’ అని తెలిపారు.

అయితే, ముందుగా ఆసియా టాప్-8లో లేని కారణంగా భారత జట్లను ఆసియా గేమ్స్‌కు పంపించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య స్పందిస్తూ.. ఆసియా క్రీడలకు భారత జట్లను పంపాలని క్రీడా మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. అలాగే, హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ సైతం ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. దాంతో ఈ విషయంపై పునరాలోచన చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనలను సడలించింది. దాంతో 2014 తర్వాత ఆసియా గేమ్స్‌లో భారత జట్లు ఫుట్‌బాల్ క్రీడలో బరిలో ఉండనున్నాయి. ఆసియా టాప్-8 జట్లలో లేకపోవడంతో 2018 ఆసియా క్రీడల్లో భారత జట్లు పాల్గొనలేదు.

Advertisement

Next Story