రోహిత్ శర్మ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే

by Harish |
రోహిత్ శర్మ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్నాడు. తొలి రెండు టెస్టులో నిరాశపర్చినప్పటికీ.. మూడో టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. ఐదో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. రెండో రోజు శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్ 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. తాజా సెంచరీతో రోహిత్ పలు రికార్డులను క్రియేట్ చేశాడు. ఆ రికార్డులు ఏంటో తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 48వ సెంచరీ. దీంతో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో అతను మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న అతను తాజా శతకంతో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి మూడో స్థానాన్ని పంచుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(80) రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా రోహిత్ 10వ స్థానంలో ఉన్నాడు.

అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ 43 శతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు క్రిస్ గేల్(42)తో సమంగా ఉన్న అతను తాజాగా అతన్ని అధిగమించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 సెంచరీలతో టాప్ పొజిషన్‌లో ఉండగా.. సచిన్ టెండూల్కర్(45) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. ఇంగ్లాండ్‌పై రోహిత్‌కు ఇది నాలుగో సెంచరీ. విజయ్ మెర్చెంట్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ మూడేసి సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టెస్టుల్లో 2021 తర్వాత భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 6 సెంచరీలు బాదాడు. హిట్‌మ్యాన్ తర్వాత శుభ్‌మన్ గిల్ 4 శతకాలతో రెండో స్థానంలో ఉండగా.. జడేజా, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మూడేసి శతకాలు బాదారు.

Advertisement

Next Story

Most Viewed