మహిళల హాకీ ఫైవ్స్ టైటిల్ భారత్‌దే.. థాయిలాండ్‌పై ఘన విజయం

by Vinod kumar |   ( Updated:2023-08-30 12:59:21.0  )
మహిళల హాకీ ఫైవ్స్ టైటిల్ భారత్‌దే.. థాయిలాండ్‌పై ఘన విజయం
X

సలాలా : భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ప్రారంభ మహిళల హాకీ ఫైవ్స్ ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి సత్తాచాటిన భారత్.. సోమవారం జరిగిన ఫైనల్‌లోనూ జోరు కనబర్చింది. తుది పోరులో థాయిలాండ్‌ను 7-2 తేడాతో చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 9-5 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. థాయిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లోనూ ఆరంభం నుంచి భారత్ దూకుడుగా ఆడింది. అయితే, మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా ప్రారంభమైంది. 2వ నిమిషంలో కుజుర్ మరియానా ఫీల్డ్ గోల్‌ చేయడంతో మ్యాచ్‌లో భారత్‌దే శుభారంభం.

అయితే, వెంటనే బదులిచ్చిన థాయిలాండ్.. 5వ నిమిషంలోనే రెండు గోల్స్ చేసింది. కుంజీరా ఇన్పా, సన్‌పౌంగ్, కోర్న్‌కనోక్ ఒకే నిమిషంలో గోల్ చేసి 2-1తో భారత్‌ను వెనక్కినెట్టారు. అనంతరం బలంగా పుంజుకున్న టీమ్ ఇండియా దూకుడు పెంచింది. 7వ నిమిషంలో మౌనిక గోల్ చేయగా.. కుజుర్ మరియానా 8వ నిమిషంలో మరో గోల్ చేసింది. కాసేపటికే 10వ నిమిషంలో జ్యోతి చేసిన గోల్‌తో ఫస్టాఫ్‌లో భారత్ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పట్టు సాధించింది. సెకండాఫ్‌లోనూ భారత్ జోరు కొనసాగించింది. పదే పదే థాయిలాండ్‌ గోల్‌పోస్టుపై దాడికి దిగింది. ఈ క్రమంలోనే జ్యోతి మరో గోల్ చేయగా.. నవ్‌జోత్ కౌర్, మహిమా చౌదరి భారత్‌కు స్వల్ప వ్యవధిలోనే మూడు గోల్స్ అందించారు.

దాంతో భారత్ 7-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు, థాయిలాండ్‌ ప్లేయర్లు మరో గోల్ చేయలేయడంలో విఫలమయ్యారు. దాంతో నిర్ణీత సమయం ముగిసే వరకూ ఆధిపత్యం చెలాయించిన భారత్ సునాయాస విజయాన్ని సొంతం చేసుకుని టైటిల్‌ను దక్కించుకుంది. అలాగే, వచ్చే ఏడాది ఒమన్‌లో జరగబోయే ఎఫ్‌ఐహెచ్ హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. మహిళల హాకీ ఫైవ్స్ ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు రూ. 2 లక్షల చొప్పున, సపోర్ట్ స్టాఫ్‌‌లో ప్రతి ఒక్కరికి రూ. లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed