మళ్లీ అదరగొట్టిన స్మృతి మంధాన.. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్

by Harish |
మళ్లీ అదరగొట్టిన స్మృతి మంధాన.. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి వన్డేలోనూ నెగ్గి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 215/8 స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ వొల్వార్డ్ట్(61) సత్తాచాటి జట్టుకు శుభారంభం అందించింది. మరో ఓపెనర్ తాజ్‌మిన్ బ్రిట్స్(38) కలిసి తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి బలమైన పునాది వేసింది. అయితే, భారత బౌలర్లు పుంజుకోవడంతో సౌతాఫ్రికా దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 200 పరుగులను దాటింది. భారత బౌలర్లలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి(2/26), దీప్తి శర్మ(2/27) రాణించారు.

అనంతరం భారత జట్టు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడింది. 83 బంతుల్లో 90 పరుగులు చేసి తృటిలో హ్యాట్రిక్ సెంచరీని మిస్ చేసుకుంది. స్మృతి దూకుడుకుతోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42) రాణించడంతో విజయం తేలికైంది. వారిద్దరూ అవుటైనా రోడ్రిగ్స్(19), రిచా ఘోష్(6) మిగతా పనిపూర్తి చేశారు. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు రెండోసారి. ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు చెన్నయ్ వేదికగా జరిగే ఏకైక టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి.

సంక్షిప్త స్కోరుబోర్డు

సౌతాఫ్రికా మహిళల ఇన్నింగ్స్ : 215/8(50 ఓవర్లు)

(వోల్వార్డ్ట్ 61, తాజ్‌మిన్ బ్రిట్స్ 38, అరుంధతి 2/36, దీప్తి 2/27)

భారత్ మహిళల ఇన్నింగ్స్ : 220/4(40.4 ఓవర్లు)

(స్మృతి మంధాన 90, హర్మన్‌ప్రీత్ 42)

Advertisement

Next Story

Most Viewed