మూడో టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా?లేడా?.. విరాట్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సెలెక్టర్లు

by Harish |
మూడో టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా?లేడా?.. విరాట్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సెలెక్టర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు మాత్రమే సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఆ లోపు జట్టును వెల్లడించాలి. అయితే, తొలి టెస్టు తర్వాత జట్టును ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కీలక ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొనడంతోనే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది.

ముఖ్యంగా విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే, మిగతా సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడా?లేడా? అన్నది సందిగ్ధం నెలకొంది. అతని నిర్ణయం కోసమే సెలెక్టర్లు ఎదురుచూస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘నిర్ణయం అతనిదే. అతని వ్యక్తిగత గోప్యతను బోర్డు గౌరవిస్తుంది. అయితే, మిడిలార్డర్‌లో అనుభవలేమి ఉంటే మాత్రం అతనితో సెలెక్టర్లు మాట్లాడే అవకాశం ఉందని ’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, తొలి టెస్టులో గాయపడి రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో పునరావసం పొందుతున్నారు. తొడకండరాల గాయం బారినపడిన జడేజా సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ మూడో టెస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ‘రాహుల్ బాగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరుతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మిడిలార్డర్ బలహీనంగా మారింది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా నిరాశపరుస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed