హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్న తెలుగు కుర్రాడు భరత్..

by Harish |
హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్న తెలుగు కుర్రాడు భరత్..
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భరత్ ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు వికెట్ కీపర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు రెండో టెస్టు జరగనుంది. హోం గ్రౌండ్‌లో భరత్ తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భరత్ మాట్లాడుతూ.. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందన్నాడు. ‘హోం గ్రౌండ్‌లో ఆడటం చాలా స్పెషల్. కచ్చితంగా గర్వపడాల్సిన విషయం. అయితే, దీన్ని నేను ఇతర టెస్టు మ్యాచ్‌లాగానే చూస్తున్నా. మేము పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదట విజయం సాధించడంపైనే మా ఫోకస్.’అని తెలిపాడు.

అలాగే, తొలి టెస్టు ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూం విషయాలను భరత్ పంచుకున్నాడు. మ్యాచ్ తర్వాత తామంతా ప్రశాంతంగానే ఉన్నామని, భయపడాల్సిన అవసరం లేదని తమకు సూచనలు వచ్చాయని చెప్పాడు. ఇది చాలా పెద్ద టెస్టు సిరీస్ అని, ఇలాంటివి తాము గతంలో చాలా ఆడామని చెప్పుకొచ్చాడు. ‘టీమ్ మీటింగ్స్‌లో మెరుగుపడాల్సిన విషయాలపై చర్చించాం. మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి.’ అని తెలిపాడు. అలాగే, ఇంగ్లాండ్ అరంగేట్రం స్పిన్నర్ టామ్ హార్ట్లీ‌ గురించి మాట్లాడుతూ..‘మేము బౌలర్లతో ఆడటం లేదు. బంతులతో ఆడుతున్నాం. అనుభవజ్ఞుడా? లేదా అనుభవం లేదా అన్నది క్రికెట్‌లో ఉండదు. ఎవరు బాగా బౌలింగ్ చేసినా.. కచ్చితంగా వారిని అభినందించాల్సిందే.’ అని భరత్ చెప్పుకొచ్చాడు.

కాగా, తొలి టెస్టులో భరత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 41, 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌తో కలిసి భరత్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలుస్తుందనే అనిపించింది. అయితే, టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో భరత్ అవుటవడంతో టీమ్ ఇండియా విజయంపై ఆశలు కోల్పోయింది. సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో భరత్ భారీ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Advertisement

Next Story