ICC Champions trophy : చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారీ మార్పు?

by Sathputhe Rajesh |
ICC Champions trophy : చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారీ మార్పు?
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై కాంట్రవర్సీ నెలకొన్న వేళ బ్రాడ్ క్యాస్టర్లు, వాటాదారులు మరో కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. టోర్నీ నిర్వహణపై ఇలాగే ప్రతిష్టంభన కొనసాగితే.. చాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌గా మార్చాలని కొంత మంది వాటాదారులు కోరుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వన్డేల నిర్వహణ కన్నా టీ20 ఫార్మాట్‌ను వేగంగా మార్కెట్ చేసుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన ఈ ఈవెంట్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని భావిస్తే పీసీబీకి భారీగా ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు క్రికెట్ ఆడే దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు సైతం దెబ్బతింటాయి. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ అంగీకరించని పక్షంలో పీసీబీ అంత తేలికగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశాలు లేవని ఐసీసీ ఈవెంట్‌లను పర్యవేక్షించే ఓ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించారు. పాకిస్తాన్ కేవలం చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యత ఒప్పందంపై సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నాడు. అన్ని దేశాల మాదిరిగానే టోర్నీ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed