పంత్ ఆటకు ఆస్ట్రేలియాలో వీరాభిమానులు ఉన్నారు : రిషబ్‌పై ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు

by Harish |
పంత్ ఆటకు ఆస్ట్రేలియాలో వీరాభిమానులు ఉన్నారు : రిషబ్‌పై ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. పంత్ ఆటకు ఆస్ట్రేలియాలో వీరాభిమానులు ఉన్నారని, అతని ఆట చాలా ఇష్టపడతారని చెప్పాడు. సియట్ అవార్డుల కార్యక్రమంలో హేడెన్.. ఆసిస్ గడ్డపై జరిగిన 2021 సిరీస్‌ను గుర్తు చేసుకున్నాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఆఖరి టెస్టులో నెగ్గిన భారత్ 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. ఆ మ్యాచ్‌లో పంత్ 138 బంతుల్లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా గబ్బా మ్యాచ్‌లో పంత్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్న హేడెన్.. రిషబ్ ఎటాకింగ్ బ్యాటింగ్ స్టైల్, రిస్క్ తీసుకునే ధోరణిని ప్రశంసించాడు.

త్వరలో ఆసిస్, భారత జట్ల మధ్య జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను కీ రోల్ పోషిస్తాడని జోస్యం చెప్పాడు. ‘పంత్‌కు కండర బలం ఉంది. అతను విజయ దాహంతో ఉన్నాడు. గతసారి అతను కీ రోల్ పోషించాడు. సహజత్వంతో కూడిన అతని ఆటను ఆస్ట్రేలియన్స్ ఇష్టపడతారు. అతని షాట్లు ఉత్తేజపరిచేలా, వినూత్నంగా ఉంటాయి. ఈ సారి సీనియర్ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. విరాట్ మళ్లీ తనదైన ముద్ర వేయాలనుకుంటాడు. కాబట్టి, ఆస్ట్రేలియా పరిస్థితులను ఎదుర్కోవడానికి టీమిండియా బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలని ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 2021లో జరిగిన సిరీస్‌లో పంత్ 68.50 సగటుతో 274 పరుగులు చేసి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది నవంబర్ చివర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Advertisement

Next Story

Most Viewed