'ఆ ముగ్గురు లేకుంటే బంగ్లాదేశ్ కంటే బలహీనం'.. టీమిండియా జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్

by Vinod kumar |
ఆ ముగ్గురు లేకుంటే బంగ్లాదేశ్ కంటే బలహీనం.. టీమిండియా జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకుంటే టీమిండియా బలహీనంగా కనిపిస్తోందని సల్మాన్ బట్ తెలిపాడు. ఈ ముగ్గురు లేకుంటే టీమిండియా ఆటతీరు బంగ్లాదేశ్‌ను తలపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనలో ఈ ముగ్గురు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా దారుణంగా విఫలమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్ ఓడిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్.. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ పర్యటనలో భారత యువ ఆటగాళ్ల ప్రదర్శన టీమ్ భవిష్యత్తుపై ఆందోళన కలిగేలా చేసింది.

'జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోతే టీమిండియా కూడా బంగ్లాదేశ్ జట్టులా బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్లు టీమిండియాను కాపాడుకుంటూ వస్తోంది ఈ ముగ్గురి అనుభవమే. అనుభవం ఉన్న ఆటగాళ్లు దూరమైతే భారత జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఐపీఎల్ కారణంగా భారత జట్టు యువ ప్లేయర్లతో మూడు జట్లను తయారుచేయొచ్చేమో. కానీ విజయాలు మాత్రం అందుకోలేరు. నేను, భారత ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడడం లేదు. కానీ సీనియర్లు లేకపోతే టీమ్‌లో నాణ్యత లోపిస్తుందనేది మాత్రం వాస్తవం.

భారత్‌లో చాలామంది సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు. కానీ ఒత్తిడిని అధిగమించడం కుర్రాళ్లకు తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ధోనీ వంటి సీనియర్లతో ఎంతో కాలం ఆడిన తర్వాత స్టార్ ప్లేయర్లుగా మారారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే భవిష్యత్తు స్టార్లపై క్లారిటీ వస్తుంది.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story