ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్ సరికొత్తగా.. కొత్త కెప్టెన్‌తోపాటు కొత్త కోచ్ కూడా

by Harish |
ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్ సరికొత్తగా.. కొత్త కెప్టెన్‌తోపాటు కొత్త కోచ్ కూడా
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా బరిలోకి దిగబోతున్నది. తాజాగా తమ కొత్త కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో జట్టును నడిపించిన మార్‌క్రమ్‌పై వేటు వేసిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆసిస్‌కు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తోపాటు వన్డే వరల్డ్ కప్‌ను అందించి కమిన్స్‌ వైపు మొగ్గు చూపింది. ఈ సారి హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తోనే కాదు.. కొత్త బౌలింగ్ కోచ్‌తోనూ టోర్నీలో అడుగుపెట్టబోతున్నది.

గత సీజన్‌లో జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సౌతాఫ్రికాకు చెందిన డెల్ స్టెయిన్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. డెల్ స్టెయిన్ నేతృత్వంలో యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రాటుదేలారు. వ్యక్తిగత కారణాలతో అతను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ఫ్రాంచైజీ తెలిపింది. అతని స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ బౌలింగ్ కోచ్‌గా నియామకమయ్యాడు. గతంలో ఫ్రాంక్లిన్ ఐపీఎల్‌లో ప్లేయర్‌గా 2011, 2012 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఏ జట్టుకూ కోచ్‌గా వ్యవహరించలేదు. అయితే, కౌంటీ క్రికెట్‌తోపాటు పాకిస్తాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ టోర్నీలో కోచ్‌గా వ్యవహరించాడు.

అంతేకాకుండా, ఎస్‌ఆర్‌హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరికి ఫ్రాంక్లిన్ మంచి స్నేహితుడు. వీరిద్దరూ న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, కౌంటీ క్రికెట్‌లో మిడిల్‌సెక్స్ క్లబ్‌తోపాటు ది హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హోమ్ ఫీనిక్స్ జట్లకు వీరిద్దరు కోచ్‌లుగా కలిసి పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed