వరల్డ్ కప్ రేసు నుంచి వెస్టిండీస్ ఔట్.. జట్టు పతనానికి కారణాలివే!

by Vinod kumar |   ( Updated:2023-07-02 11:26:46.0  )
వరల్డ్ కప్ రేసు నుంచి వెస్టిండీస్ ఔట్.. జట్టు పతనానికి కారణాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వన్డే ప్రపంచకప్‌లో గొప్ప ప్రమాణాలను నెలకొల్పి.. ఆ టోర్నీకే వన్నె తెచ్చిన జట్టు వెస్టిండీస్​. అలాంటిది ఇప్పుడు.. ఏకంగా 2023 వన్డే వరల్డ్ క ప్​ టోర్నీకే దూరమైంది. వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు దూరమైందనే వార్త ఇప్పటి క్రికెట్‌ అభిమానులకు మామూలు విషయం లాగే అనిపించొచ్చు. కానీ 70, 80 దశకాల్లో క్రికెట్‌ను అనుసరించిన అభిమానులకు మాత్రం ఇదొక పెద్ద విషాదమే. కేవలం వెస్టిండీస్‌ అభిమానులే కాదు.. ఆ తరం ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరికీ ఇది పెద్ద షాకే. ఎందుకంటే అప్పుడు కరీబియన్‌ జట్టు సాగించిన ఆధిపత్యం వేరు.. ఆ జట్టు ఆటగాళ్ల ఆకర్షణే వేరు. అప్పుడు రిచర్డ్స్‌ విధ్వంసక విన్యాసాలకు బెదరని బౌలర్‌ లేడు! మార్షల్‌ బంతులకు బెంబేలెత్తని బ్యాటర్‌ లేడు!

ప్రపంచ క్రికెట్లో విండీస్‌ పతనానికి పునాది ఎప్పుడో 90ల్లోనే పడింది. ఎంతటి మేటి ఆటగాళ్లయినా ఒక దశ దాటాక ఆటకు దూరం కావాల్సిందే. ప్రతి జట్టూ ఇలాంటి దశను ఎదుర్కొంటుంది. కానీ రిచర్డ్స్‌ తరం క్రికెటర్లు నిష్క్రమించాక ఆ లోటును విండీస్‌ భర్తీ చేసుకోలేకపోయింది. 90వ దశకంలో ఆంబ్రోస్‌, వాల్ష్‌, లారా లాంటి మేటి ఆటగాళ్లున్నా.. సమష్టితత్వం కొరవడి విండీస్‌ నిలకడగా విజయాలు సాధించలేకపోయింది.

అన్నింట్లోనూ ఆ జట్టు ప్రదర్శన దెబ్బ తింది. నిలకడ తప్పింది. కానీ ఆ జట్టులో ఎప్పుడూ ప్రతిభావంతులకు లోటు లేదు. గేల్‌, బ్రావో, పొలార్డ్‌ సహా ఎంతోమంది ప్రపంచ స్థాయి క్రికెటర్లు వచ్చారు. నిలకడ లేదన్న మాటే కానీ.. అప్పుడప్పుడూ ఆ జట్టు మేటి జట్లను దీటుగా ఎదుర్కొని విజయాలూ సాధించేది. అయితే జీతాలు, కాంట్రాక్టుల విషయంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డుతో ఆటగాళ్ల గొడవ విండీస్‌ క్రికెట్‌ పునాదులు కదిలిపోయేలా చేసింది. ఏళ్ల తరబడి సాగిన ఈ గొడవ.. ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఆటగాళ్లు దేశానికి ఆడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మానేశారు. ప్రముఖ క్రికెటర్లు చాలామంది కాంట్రాక్టులు వదులుకున్నారు.

అదే సమయంలో టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రావడంతో వారికి ప్రత్యామ్నాయాలు పెరిగిపోయాయి. దీంతో ఫ్రాంఛైజీ క్రికెట్‌కే వాళ్లు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో విండీస్‌ జట్టుకు ఒక రూపు అంటూ లేకుండా పోయింది. ఇలాంటి ప్రతికూలతల మధ్య కూడా విండీస్‌లో క్రికెట్‌ ప్రతిభ వల్ల, టీ20 క్రికెట్లో వారి నైపుణ్యం వల్ల ఈ ఫార్మాట్లో రెండు ప్రపంచకప్‌లు (2012, 2016) గెలిచింది కరీబియన్‌ జట్టు. కానీ మొత్తంగా ఆ జట్టు ప్రమాణాలు మాత్రం పెరగలేదు. టీ20 క్రికెట్‌ ప్రభావం విండీస్‌ మీద ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపింది. లీగ్‌ క్రికెట్‌కు బాగా అలవాటైపోయిన ఆ జట్టు ఆటగాళ్లు.. ఎక్కువ సమయం క్రీజులో నిలవాల్సిన టెస్టులు, వన్డేల్లో తేలిపోవడం మొదలైంది.

ఈ ఫార్మాట్లలో ప్రదర్శన అంతకంతకూ పడిపోయింది. ర్యాంకింగ్స్‌లో పతనం వల్ల 2023 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం కోల్పోయిన విండీస్‌.. ఇప్పుడు క్వాలిఫయర్‌లోనూ సత్తా చాటలేకపోయింది. జింబాబ్వే, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి చిన్న జట్ల చేతిలో ఓటమితో తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ ఆడలేని దుస్థితికి చేరుకుంది. మొత్తంగా చెప్పాలంటే.. జట్టులో టాలెంట్ ప్లేయర్స్ ఉన్నా.. వారిలో సమష్టితత్వం లోపించించి. దేశానికి ఆడటాన్ని గర్వంగా భావించకపోవడం, అలాగే తపన కొరవడటంతో.. విండీస్​ టీమ్​ పతనమైపోయింది.

Advertisement

Next Story