క్రికెట్‌కు ఫైజ్ ఫజల్ వీడ్కోలు

by Harish |
క్రికెట్‌కు ఫైజ్ ఫజల్ వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్, విదర్భ ఓపెనర్ ఫైజ్ ఫజల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు సోమవారం వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీలో హర్యానాతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్ బై చెప్పాడు. ‘నాగ్‌పూర్‌లో 21 ఏళ్ల క్రితం నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మొదలైంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. టీమ్ ఇండియాకు, విదర్భకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. నాకు ఇష్టమైన నం.24 జెర్సీకి వీడ్కోలు. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. ఒక చాప్టర్ ముగిసింది. మరో అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నాను.’ అని ఫైజ్ ఫజల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు.

కాగా, 38 ఏళ్ల ఫైజ్ ఫజల్ జాతీయ జట్టు తరపున ఏకైక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2016లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన అతను ఆ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమ్ ఇండియా తరపున అదే అతనికి చివరి మ్యాచ్ కూడా. ఆ తర్వాత జాతీయ జట్టు తరపున అవకాశాలు అందుకోలేకపోయాడు. అయితే, దేశవాళీలో మాత్రం ఫైజ్ ఫజల్ చాలా క్రికెట్ ఆడాడు. 138 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 9, 184 పరుగులు చేశాడు. అలాగే, 113 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 3,641 రన్స్, 66 టీ20ల్లో 1,273 పరుగులు చేశాడు. అంతేకాకుండా, ఫైజ్ ఫజల్ కెప్టెన్సీలో 2018లో విదర్భ తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలుచుకుంది. ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ తరపున 12 మ్యాచ్‌లు ఆడిన అతను 183 పరుగులు చేశాడు.

Advertisement

Next Story