Wimbledon : వింబుల్డన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసోవాకు షాక్

by Harish |
Wimbledon : వింబుల్డన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసోవాకు షాక్
X

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌‌లో రెండో రోజు సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసోవా(చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. అన్‌సీడ్ క్రీడాకారిణి జెస్సికా బౌజాస్(స్పెయిన్) అద్భుతం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో బౌజాస్ 6-4, 6-2 తేడాతో వొండ్రుసోవాను ఓడించింది. అన్‌సీడ్ క్రీడాకారిణి ముందు వొండ్రుసోవా కనీసం పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. గంటా 7 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. వొండ్రుసోవా 4 ఏస్‌లు, 18 విన్నర్లు బాదితే.. బౌజాస్ 2 ఏస్‌లు, 12 విన్నర్లే కొట్టింది. కానీ, అనవసర తప్పిదాలు వొండ్రూసోవా కొప్పముంచాయి. 7 డబుల్స్ ఫౌల్ట్స్, 28 అనవసర తప్పిదాలతో ఆమె మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌కు షాకిచ్చి బౌజాస్ రెండో రౌండ్‌కు చేరుకుంది. అంతేకాకుండా, 30 ఏళ్లలో తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అలాగే, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్(పొలాండ్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో స్వైటెక్ 6-3, 6-4 తేడాతో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై విజయం సాధించింది. కెనిన్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. స్వైటెక్ తన తన ఆధిపత్యం చాటుతూ వరుస సెట్లలోనే మ్యాచ్‌ను ముగించింది. మాజీ వింబుల్డన్ చాంపియన్ రిబాకినా(కజకస్థాన్) కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది.

జకో ఆట మొదలు

24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, సెర్బియా దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్ జోరు మొదలైంది. వింబుల్డన్‌లో అతను శుభారంభం చేశాడు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో జకోవిచ్ 6-1, 6-2, 6-2 తేడాతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ విట్ కొప్రివాను చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో జకో వరుసగా మూడు సెట్‌లను నెగ్గి కేవలం గంటా 58 నిమిషాల్లోనే మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. జకో 10 ఏస్‌లు, 32 విన్నర్లతో విరుచుకపడ్డాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో జకో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్‌లో వైదొలిగిన విషయం తెలిసిందే. మరోవైపు, వరల్డ్ నం.6 ఆండ్రీ రుబ్లేవ్‌‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. అతనికి అన్‌సీడ్ ప్లేయర్ ఫ్రాన్సిస్కో కమెసానా(అర్జెంటీనా) షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన పోరులో రుబ్లేవ్‌పై 4-6, 7-5, 2-6, 6-7(5-7) తేడాతో విజయం సాధించాడు. భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్‌కు తొలి వింబుల్డన్ మెయిన్ డ్రాలో నిరాశే ఎదురైంది. తొలి రౌండ్‌లోనే అతను నిష్ర్కమించాడు. సెర్బియా ప్లేయర్ కెక్‌మనోవిచ్ చేతిలో 2-6, 6-3, 3-6, 4-6 తేడాతో పోరాడి ఓడిపోయాడు.

Next Story

Most Viewed