Shikhar Dhawan : ధావన్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న గబ్బర్

by Harish |
Shikhar Dhawan : ధావన్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న గబ్బర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌(ఎల్‌ఎల్‌సీ)లో ఆడబోతున్నాడు. వచ్చే ఎల్‌ఎల్‌సీ సీజన్‌లో ధావన్ కనిపించనున్నాడు. ధావన్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీడ్కోలు పలికిన రెండు రోజుల తర్వాత అతను ఎల్‌ఎల్‌సీలో భాగం కానున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ఎల్‌ఎల్‌సీ నిర్వాహకులు కూడా ధ్రువీకరించారు.

తాజాగా ఓ జాతీయ మీడియాతో ధావన్ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ ప్రకటించడంతో తన మనసు తేలికగా ఉందని, అలాగే, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో తన క్రికెట్ స్నేహితులతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ‘నా శరీరం ఇంకా ఆడేందుకు సిద్ధంగానే ఉంది. నేను తీసుకున్న నిర్ణయంతో చాలా తేలికగా ఉన్నా. క్రికెట్‌తో విడదీయరాని బంధం ఉంది. అది నా నుంచి వెళ్లిపోదు. నా క్రికెట్ స్నేహితులతో మళ్లీ కలవడానికి, నా అభిమానులను అలరించడానికి ఆసక్తిగా ఉన్నా.’ అని తెలిపాడు.

కాగా, టీమిండియాకు ధావన్ 14 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. 34 టెస్టుల, 167 వన్డేలు, 68 టీ‌20లు ఆడిన అతను.. మూడు ఫార్మాట్లలో మొత్తం 10.867 పరుగులు చేశాడు. మరోవైపు, 2021లో ప్రారంభమైన లెజెండ్స్ లీగ్ క్రికెట్ గతేడాది మూడో సీజన్‌ను పూర్తి చేసుకుంది. భారత్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. వచ్చే సీజన్ ఖతార్‌లో జరగనుంది.

Advertisement

Next Story