ఆరో టైటిల్‌పై ధోనీ సేన గురి

by Harish |
ఆరో టైటిల్‌పై ధోనీ సేన గురి
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు సన్నద్ధత మొదలుపెట్టగా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కానీ, ఫేవరెట్ జట్టు అంటే ప్రముఖంగా వినిపించే పేరు చెన్నయ్ సూపర్ కింగ్స్. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆ జట్టు టైటిల్ నిలబెట్టుకోవడంపై ఫోకస్ పెట్టింది. ధోనీ నాయకత్వంలో చెన్నయ్ ఆరో టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో కలిసి అత్యధికంగా టైటిల్స్ నెగ్గిన జట్టుగా కొనసాగుతున్న చెన్నయ్.. ఈ సీజన్‌లోనూ చాంపియన్‌గా నిలిచి రికార్డు టైటిల్స్ నెగ్గిన జట్టుగా మారాలని భావిస్తున్నది. ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో బెంగళూరును ఢీకొట్టడంతో ద్వారా సీఎస్కే టోర్నీని ఆరంభించనుంది. మరి, చెన్నయ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం..

చెన్నయ్ జట్టు బ్యాటింగ్ పరంగా పేపర్‌పై బలంగా కనిపిస్తున్నది. 8వ స్థానం వరకు సీఎస్కేకు బ్యాటింగ్ సామర్ధ్యం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, జడేజా, ధోనీ, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్ వరకు బ్యాటుతో సత్తాచాటే వాళ్లే. ఇటీవల భీకర ఫాంలో ఉన్న కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌లను వేలంలో కొనుగోలు చేయడంతో సీఎస్కే బ్యాటింగ్ బలం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్‌లో వీరిద్దరూ చెలరేగిన విషయం తెలిసిందే. శార్దూల్ ఠాకూర్ తిరిగి రావడం, ముస్తఫిజుర్ రెహ్మాన్‌ కొనుగోలుతో ఆ జట్టు బౌలింగ్ దళంగా కూడా మెరుగుపడిందనే చెప్పొచ్చు. దీపక్ చాహర్, పతిరణ, మహేశ్ తీక్షణ వంటి బౌలర్లు ధోనీ నాయకత్వంలో రాటుదేలి సత్తాచాటుతున్నారు. పతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే గత సీజన్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. బలమైన బ్యాటింగ్ బలమున్న సీఎస్కేకు బౌలర్లు తమ వంతు సహకారం అందిస్తే ఆ జట్టు జైత్రయాత్ర కొనసాగించడం ఖాయమే.

ధోనీనే బలం

ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ముందు వరుసలో ఉంటాడు. ధోనీ సారథ్యంలో చెన్నయ్ ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గత మూడు సీజన్లలో రెండుసార్లు టైటిల్ దక్కించుకుంది. చెన్నయ్ జట్టుకు ప్రధాన బలం ధోనీనే. ధోనీ కెప్టెన్సీ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును తన వ్యూహ రచనతో గెలుపు బాట పట్టించగలడు. అంతేకాకుండా, జట్టులోని ప్రతి ఆటగాడి బలాబలాలపై అతనికి అవగాహన ఉంటుంది. ఏ సందర్భంలో ఏ ఆటగాడిని సద్వినియోగం చేసుకోవాలో కెప్టెన్‌గా అతనికి తెలిసినంత మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు, ఆటగాడిగానూ అతని శక్తి సామర్థ్యాలపై ఎవరికీ అనుమానాలు లేవు. గత సీజన్‌లో కాలు గాయంతోనూ మెరుపులు మెరిపించడాన్ని చూశాం. దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఐపీఎల్‌తో మైదానంలోకి అడుగుపెడుతుండటంతో అందరి దృష్టి అతనిపైనే ఉంది.

కాన్వే, పతిరణకు గాయాలు

గత సీజన్‌లో సత్తాచాటిన ఓపెనర్ డేవాన్ కాన్వే, పేసర్ పతిరణ గాయాల బారిన పడటం సీఎస్కేను ఆందోళనకు గురిచేస్తున్నది. వారిద్దరూ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు వార్తలు వస్తున్నా.. లీగ్‌ వారు పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ వారిద్దరూ దూరమైతే జట్టుకు భారీ లోటే. మరోవైపు, అజింక్య రహానే ఫామ్ కూడా కలవరపెడుతున్నది. ఇటీవల రంజీ ట్రోఫీలో అతను ఆకట్టుకోలేదు. అయితే, అతని బ్యాటింగ్ సామర్థ్యంపై అనుమానాలు లేవు. మిడిలార్డర్‌లో గత సీజన్‌లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed