యూత్ ఒలింపిక్స్-2030లో క్రికెట్‌?.. ఐసీసీ అధికారి ఏం చెప్పారంటే?

by Harish |
యూత్ ఒలింపిక్స్-2030లో క్రికెట్‌?.. ఐసీసీ అధికారి ఏం చెప్పారంటే?
X

దిశ, స్పోర్ట్స్ : లాస్ ఏంజిల్స్‌ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. 1900 ఒలింపిక్స్‌లో కనిపించిన క్రికెట్ 128 ఏళ్ల తర్వాత పునరాగమనం చేయబోతున్నది. 2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను చేర్చాలని ఐసీసీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఐసీసీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ విలియమ్ గ్లెన్‌రైట్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఆ క్రీడలకు ఆతిథ్యమివ్వడానికి భారత్ ఆసక్తి చూపిస్తున్నది.

ఇదే విషయాన్ని చెబుతూ వివేక్ గోపాలన్ అనే వ్యక్తి ఐసీసీ అధికారులకు మెయిల్ చేశాడు. ‘2030 యూత్ ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి ముంబై బిడ్ వేయడం ద్వారా యూత్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. టాప్ క్రీడలన్ని యూత్ ఒలింపిక్స్‌లో ఉన్నాయి. క్రికెట్‌ ఎందుకు ఉండొద్దు?. క్రికెట్‌ను చేర్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐసీసీ అసోసియేట్ దేశాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.’ అని పేర్కొన్నాడు. దీనికి ఐసీసీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ విలియమ్ గ్లెన్‌రైట్ బదులిస్తూ..‘మంచి ఆలోచన. ఆలోచించదగినదే.’ అని రిప్లై ఇచ్చాడు. కాగా, 2030 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed