ఉస్మాన్ ఖవాజా రిక్వెస్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమోదం

by Swamyn |
ఉస్మాన్ ఖవాజా రిక్వెస్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమోదం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనాకు మద్దతుగా అతను ‘స్వేచ్ఛ అనేది మానవుల హక్కు. అందరి జీవితాలు సమానమే’ అని రాసి ఉన్న షూస్ నెట్ ప్రాక్టీస్‌లో ధరించడం, పాకిస్తాన్‌తో తొలి టెస్టులో నల్ల ఆర్మ్ బ్యాండ్ ధరించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఐసీసీ అతన్ని మందలించింది కూడా. అయితే, తన అభిప్రాయాలను వ్యక్తపర్చడంలో తప్పేముందని అతని వాదన. ఈ మేరకు ఐసీసీకి లేఖ కూడా రాశాడు. అయితే, ఐసీసీ అతన్ని అభ్యర్థనను తిరస్కరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అనుమతి లేదు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం ఖవాజాకు మద్దతుగా నిలిచింది. తన బ్యాటుపై పావురం, ఓలివ్ బ్రాంచ్ లోగోలను ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. పావురం, ఓలివ్ బ్రాంజ్ లోగోలు శాంతికి చిహ్నాలు. తాజాగా సీఏ అత్యవసర సమావేశంలో ఖవాజా అభ్యర్థనకు ఆమోదం లభించింది. అయితే, ఖవాజా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం ఆ లోగోలను ప్రదర్శించడానికి వీలు లేదు. కేవలం బిగ్ బాష్ లీగ్‌(బీబీఎల్)లో మాత్రమే అతనికి సీఏ అనుమతినిచ్చింది. బీబీఎల్‌లో అతను బ్రిస్బేన్ హీట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం బీబీఎల్ సీజన్‌ ప్రారంభమైంది. కానీ, ఖవాజా పాక్‌తో టెస్టు సిరీస్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రేపటి నుంచి ఆఖరిదైన మూడో టెస్టు జరగనుంది. ఈ సిరీస్ అనంతరం అతను బీబీఎల్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story