గవాస్కర్, సచిన్, ద్రవిడ్ ఆ తర్వాత ఆ ఘనత సాధించిన పుజారా.. తిరిగి టీమ్ ఇండియాలోకి వస్తాడా?

by Harish |
గవాస్కర్, సచిన్, ద్రవిడ్ ఆ తర్వాత ఆ ఘనత సాధించిన పుజారా.. తిరిగి టీమ్ ఇండియాలోకి వస్తాడా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాలోకి తిరిగి రావడమే లక్ష్యంగా సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. టోర్నీలో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. తాజాగా విదర్భతో మ్యాచ్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాలో 43, 66 పరుగులు చేసిన పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా 260 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 51.98 సగటుతో 20,013 పరుగులు చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. పుజారా కంటే ముందు సునీల్ గవాస్కర్(25,834), సచిన్ టెండూల్కర్(25, 396), రాహుల్ ద్రవిడ్(23,794) ఉన్నారు. గతేడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత పుజారా భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టుకు కూడా సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అతను.. రంజీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగులతో అజేయంగా నిలిచాడు. హర్యానాపై 49, 43 పరుగులు చేశాడు. మరి, ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు ప్రకటించే భారత జట్టులోనైనా పుజారాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.

ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. విదర్భపై సౌరాష్ట్ర 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 205/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 244 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం 128 పరుగులు కలుపుకుని సౌరాష్ట్ర.. విదర్భ ముందు 373 పరుగుల లక్ష్యం పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 134 పరుగులకే ఆలౌటవడంతో టోర్నీలో సౌరాష్ట్ర తొలి విజయం నమోదు చేసింది. చిరాగ్ జానీ 5 వికెట్ల ప్రదర్శనతో సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story

Most Viewed