- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యూజీలాండ్ Vs సౌత్ ఆఫ్రికా.. రెండో సెమీస్‌లో గెలిచేది ఎవరో?

- లాహోర్ వేదికగా రెండో సెమీస్
- ఫైనల్ బెర్త్ సాధించే జట్టు ఏది?
- కివీస్ స్పిన్‌కు.. సఫారీల బ్యాటింగ్‌కు పోటీ
దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి అంకానికి చేరుకుంది. న్యూజీలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో బుధవారం రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ రెండు జట్లు కూడా గతంలో సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓడిపోతాయనే సెంటిమెంట్ ఉన్న జట్లే. దీంతో మరో సారి ఈ రెండింటిలో ఒక జట్టు సెమీస్‌లోనే తమ ప్రయాణాన్ని ముగించేస్తుంది. కాగా గతంలో ఐసీసీ నాకౌట్ ట్రోఫీని ఈ రెండు జట్లు చెరో సారి గెలిచాయి. 1998లో సౌతాఫ్రికా, 2000లో న్యూజీలాండ్ ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలిచాయి. ఆ ట్రోఫీని ఆ తర్వాత కాలంలో చాంపియన్స్ ట్రోఫీగా ఐసీసీ ప్రవేశపెట్టింది. ఈ రెండు జట్లు కూడా ఇంత వరకు చాంపియన్స్ ట్రోఫీని నెగ్గలేదు.
సెమీస్‌కు ఇలా..
న్యూజీలాండ్ జట్టు గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక సౌతాఫ్రికా జట్టు గ్రూప్ బిలో టాప్ పొజిషన్‌కు చేరింది. ఇంగ్లాండ్, ఆఫ్గానిస్తాన్ జట్ల మీద సౌతాఫ్రికా జట్టు గెలిచింది. అయితే ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో లీగ్ దశలో 5 పాయింట్లు సాధించి టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా మేజర్ టోర్నీలలో నాకౌట్ దశలో విఫలమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఎవరిని విజయం వరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా ఫామ్ చూస్తే కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఈ జట్టు గత 13 వన్డేలకు గాను 8 వన్డేల్లో ఓడిపోయింది. కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ సెంచరీతో చెలరేగాడు. ఇక తెంబూ బవూమా, రస్సీ వాన్ డార్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్‌లు సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌కు కీలకంగా ఉన్నారు. సఫారీల బౌలింగ్‌లో కగిసో రబాడా, లుంగి ఎన్‌గిడి, మార్కో జన్‌సెన్, కేశవ్ మహరాజ్ కీలక పాత్ర పోషిస్తారు. కాగా, మార్కరమ్ గాయపడటంతో అతని స్థానంలో జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.
కివీస్ జట్టు కూడా సఫారీలతో సమానమైన బలమే కలిగి ఉంది. అయితే కివీస్ జట్టులో బౌలింగ్ వైవిద్యం వారికి ప్లస్ కానుంది. మాట్ హెన్రీ ఈ టోర్నీలు ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక విల్ ఓరూర్కే ఆరు వికెట్లు తీశాడు. వీరిద్దరి కాంబినేషన్ సఫారీలను ఇబ్బంది పెట్టగలదు. మిచెల్ శాంట్నర్, మైఖెల్ బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి వారు బంతితో మ్యాజిక్ చేయగలరు. ఇలాంటి వైవిద్యమైన బౌలింగ్ సఫారీల వద్ద లేదు. ఇక బ్యాటింగ్‌లో టామ్ లాథమ్, కేన్ విలియమ్‌సన్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడిన రోజు కివీస్ భారీ స్కోరును అయినా ఛేదించగలదు.
హెడ్ టూ హెడ్..
న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పటి వరకు 71 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో దక్షిణాప్రికా జట్టు 42, న్యూజీలాండ్ జట్టు 26 మ్యాచ్‌లు గెలిచింది. ఐదు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక ఈ నెల మొదట్లో ఈ రెండు జట్లు లాహోర్‌లోనే ట్రై సిరీస్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అందులో కివీస్ జట్టు ఆరు వికెట్లు తేడాతో విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్..
లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక పేస్ బౌలర్లకు ఈ పిచ్ సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 302 పరుగులు. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతాడు. ప్రస్తుతం లాహోర్‌లో వాతావరణం చల్లగా ఉంది. తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
జట్ల అంచనా :
సౌతాఫ్రికా : తెంబా బవూమా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, అయిడెన్ మార్కరమ్ లేదా ట్రైస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, మార్కో జన్‌సెన్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, లుంగి ఎన్‌గిడి
న్యూజీలాండ్ : విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్‌సన్, డేరిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్, మైఖెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జేమిసన్, విలియమ్ ఓరూర్కే