CT 2025: మళ్లీ అవే జట్లు.. 2015 నాటి కథ రిపీట్ అవుతుందా? లేదా ఇండియా చెల్లుకు చెల్లు ఇచ్చేస్తుందా?

by Vennela |
CT 2025: మళ్లీ అవే జట్లు.. 2015 నాటి కథ రిపీట్ అవుతుందా? లేదా ఇండియా చెల్లుకు చెల్లు ఇచ్చేస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: Champions Trophy 2025: ఒక్కో మ్యాచ్ గడిచేకొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అభిమానులు ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. 2015 ప్రపంచకప్ మాదిరిగా ఇది మళ్లీ ఆస్ట్రేలియా చేతుల్లోనే వెళ్తుందా? లేక టీమిండియా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించబోతుందా?

దశాబ్దం క్రితం.. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఇదే కథ ఆవిష్కృతమైంది. అప్పుడు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం సమరం నడిచింది. చివరికి, ఆస్ట్రేలియా విజయ తాండవం చేస్తూ ఆ కప్పును పట్టుకుపోయింది. ఒక దశాబ్దం గడిచింది. కానీ అదే నాటకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో మళ్లీ ఆ నాలుగు టీమ్‌లే వచ్చాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా. క్రీడా చరిత్రలో ఇలాంటి Co-incidences చాలా అరుదు. కానీ ఈ నాలుగు జట్లు మరోసారి టైటిల్ కోసం ఒకే వేదికపై తలపడుతున్నాయి.

ఇప్పటికే లీగ్ దశ ముగిసింది. టీమిండియా తన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక సెమీ-ఫైనల్ సమరంలో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇది చూసిన వారందరికీ 2015 ప్రపంచకప్ నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో జరిగిన మ్యాచ్‌లకు, ఇప్పటి మ్యాచింగ్‌లు చూస్తే.. ఒక అద్భుతమైన గేమ్ రిప్లే మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2015లో ఆస్ట్రేలియా భారత్‌ను సెమీస్‌లో ఓడించింది. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా కప్ గెలిచింది. ఈ క్రమంలో గతం మళ్లీ పునరావృతం అవుతుందా? లేక ఈసారి కొత్త కథ రాస్తారా?

ఇక 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్‌లో చివరిసారి 2013లో భారత్‌ గెలిచింది. ఆఖరి సారి 12ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టు ఆ తరువాత ఏ వన్డే ఐసీసీ టోర్నమెంట్‌లోనూ కప్పును అందుకోలేకపోయింది. 2023 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినా, ఆఖరి అంకంలో చతికిలపడింది. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు అత్యంత కీలకమనే చెప్పాలి. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. బౌలింగ్ విభాగంలో కీలకమైన మార్పులు, టాప్ ఆర్డర్ బ్యాటర్‌ చక్కటి ఫామ్‌లో ఉండడం భారత్‌కు మేలు చేయనుంది.

ఇక ఒక్కో మ్యాచ్ గడిచేకొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అభిమానులు ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. 2015 ప్రపంచకప్ మాదిరిగా ఇది మళ్లీ ఆస్ట్రేలియా చేతుల్లోనే వెళ్తుందా? లేక టీమిండియా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించబోతుందా? లేదంటే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కప్‌ గెలుస్తాయా? చూడాలి మరి.

Next Story