పంచ్ అదిరింది.. బాక్సింగ్‌లో ఐదు స్వర్ణాలు

by Harish |
పంచ్ అదిరింది.. బాక్సింగ్‌లో ఐదు స్వర్ణాలు
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అదరగొట్టారు. యూత్ కేటగిరీలో భారత్ ఖాతాలో ఐదు స్వర్ణ పతకాలను చేర్చారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్(48 కేజీలు), ఆర్యన్ హుడా(51 కేజీలు), యశ్వర్ధన్ సింగ్(63.5 కేజీలు).. మహిళల విభాగంలో లక్ష్మి(50 కేజీలు), నిషా(52 కేజీలు) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో బ్రిజేశ్ 5-0 తేడాతో ముమినోవ్(తజికిస్తాన్)ను ఓడించగా.. ఆర్యన్ అంతే తేడాతో కమిలోవ్ జాఫర్‌బెక్(కిర్గిజిస్తాన్)ను చిత్తు చేశాడు. మరో బౌట్‌లో యశ్వర్ధన్ సింగ్ 4-1 తేడాతో గఫురోవ్ రుస్లాన్(తజికిస్తాన్)పై విజయం సాధించాడు. మహిళల కేటగిరీ ఫైనల్ బౌట్లలో నిషా 5-0 తేడాతో ఒటన్‌బే బగ్జాన్(కజకిస్తాన్)పై, ఎంఖ్ నోముందరి(మంగోలియా)ను లక్ష్మి రెండో రౌండ్‌లోనే మట్టికరిపించింది. అలాగే, సాగర్(60 కేజీలు), ప్రియాన్షు(71 కేజీలు), రాహుల్ కుండు(75 కేజీలు), ఆర్యన్(92 కేజీలు), తమన్నా(54 కేజీలు), నికిత చంద్(60 కేజీలు), శ్రుతి(63 కేజీలు), రుద్రిక(75 కేజీలు), ఖుషి పూనియా(81 కేజీలు) తమ విభాగాల్లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టారు. యూత్ విభాగంలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 22 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.

Advertisement

Next Story

Most Viewed