బీసీసీఐ కీలక నిర్ణయం.. దేశవాళీలో సత్తాచాటే ప్లేయర్లకు ప్రైజ్‌మనీ

by Harish |
బీసీసీఐ కీలక నిర్ణయం.. దేశవాళీలో సత్తాచాటే ప్లేయర్లకు ప్రైజ్‌మనీ
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి, ప్రతిభగల ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీలో అద్భుతంగా రాణించే ప్లేయర్లకు ప్రైజ్‌మనీ ఇవ్వాలని నిర్ణయించింది. అన్ని మహిళల, జూనియర్ టోర్నీ‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌‌ అవార్డులను ఇవ్వబోతున్నది. అలాగే, సీనియర్ పురుషుల విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘బీసీసీఐ దేశవాళీ క్రికెట్ ప్రొగ్రామ్‌లో భాగంగా జరిగే అన్ని మహిళల, జూనియర్ క్రికెట్ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ప్రైజ్‌మనీలను ఇవ్వబోతున్నాం. అలాగే, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందజేస్తాం. దేశవాళీలో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి సత్కరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో అపెక్స్ కౌన్సిల్ మద్దతుకు ధన్యవాదాలు. మన క్రికెటర్లు మరింత ఆర్జించేలా పనిచేస్తాం.’ అని జై షా పేర్కొన్నారు.

పురుషుల జూనియర్ లెవెల్‌లో అండర్-16(విజయ్ మర్చంట్ ట్రోఫీ), అండర్-19 (కూచ్ బెహార్ ట్రోఫీ), అండర్-23(సీకే నాయుడు ట్రోఫీ), మహిళల విభాగంలో అండర్-15, అండర్-19, అండర్-23 టోర్నీలను బీసీసీఐ నిర్వహిస్తున్నది. ఈ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లకు వార్షిక అవార్డులను ఇస్తున్నారు. కానీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి. గతేడాది బీసీసీఐ దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీని పెంచిన విషయం తెలిసిందే. వచ్చే నెల 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో భారత దేశవాళీ సీజన్ మొదలుకానుంది.

Advertisement

Next Story

Most Viewed