ఇంగ్లాండ్‌కు షాక్.. టీ20 సిరీస్ బంగ్లాదే..

by Vinod kumar |
ఇంగ్లాండ్‌కు షాక్.. టీ20 సిరీస్ బంగ్లాదే..
X

ఢాకా: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి టీ20 నెగ్గిన బంగ్లాదేశ్.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. 4 వికెట్ల తేడాతో బంగ్లా జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌటైంది. డకెట్ చేసిన 28 పరుగులే టాప్ స్కోరర్. కెప్టెన్ బట్లర్(4), డేవిడ్ మలన్(5), మొయిన్ అలీ(15), సామ్ కర్రన్(12), క్రిస్ వోక్స్(0) దారుణంగా విఫలమవడంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మెహిదీ హసన్ మిరాజ్(4/12) బంతితో సత్తాచాటి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.

118 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు లిటాన్ దాస్(9), రోనీ తాలూక్దార్(9)తోపాటు షకీబ్ అల్ హసన్(0), అఫీఫ్ హుస్సేన్(2) నిరాశపర్చినా.. శాంటో(46) చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. తాహిద్(17), మెహిదీ హసన్ మిరాజ్(20)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన శాంటో.. ఒకవైపు వికెట్లు పడుతున్నా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును గెలిపించాడు. దాంతో మరో 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ 120/6 స్కోరు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3 వికెట్లు తీయగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్‌లకు తలో ఒక వికెట్ దక్కింది. సిరీస్‌లో నామామాత్రపు ఆఖరి టీ20 ఢాకా వేదికగానే మంగళవారం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed