బంగ్లా ఆల్‌రౌండర్ నాసీర్ హొస్సేన్‌పై వేటు

by Harish |
బంగ్లా ఆల్‌రౌండర్ నాసీర్ హొస్సేన్‌పై వేటు
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసీర్ హొస్సేన్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించిన కారణంగా అతనిపై రెండేళ్లు బ్యాన్, ఆరు నెలలు సస్పెన్షన్ విధించింది. 2021లో అబుదాబి టీ10 లీగ్‌లో పుణె డెవిల్స్‌కు నాసీర్ హొస్సేన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్టు నాసీర్ హొస్సేన్‌తోసహా ఎనిమిది మందిపై ఆరోపణలు వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో అతనిపై ఐఫోన్ 12 బహుమతి రశీదు చూపడంలో విఫలమవడం, పూర్తి అవినీతి‌ ప్రక్రియను నివేదించకపోవడం, విచారణకు సహకరించకపోవడం వంటి అభియోగాలను ఐసీసీ మోపింది. తాజాగా తనపై వచ్చిన అభియోగాలను నాసీర్ హొస్సేన్ అంగీకరించడతో ఐసీసీ చర్యలకు పూనుకుంది. అన్ని ఫార్మాట్ల నుంచి అతన్ని రెండేళ్లు బ్యాన్, ఆరు నెలలు సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది ఏఫ్రిల్ 7 తర్వాత అతను తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావొచ్చని ఐసీసీ తెలిపింది. కాగా, బంగ్లాదేశ్ తరపున అన్ని ఫార్మాట్లలో 115 మ్యాచ్‌లు ఆడిన హొస్సేన్.. 2,695 పరుగులతోపాటు 39 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

Next Story