విజయం దిశగా శ్రీలంక.. మరో 5 వికెట్ల దూరంలో

by Harish |
విజయం దిశగా శ్రీలంక.. మరో 5 వికెట్ల దూరంలో
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక విజయం ముంగిట నిలిచింది. మరో 5 వికెట్లు తీస్తే ఆ జట్టు‌దే తొలి టెస్టు. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఛేదనలో బంగ్లాదేశ్ 47/5తో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 119/5తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులు చేసింది. కమిందు మెండిస్(164), ఓవర్‌నైట్ బ్యాటర్ ధనంజయ డె సిల్వ(108) సెంచరీలతో కదం తొక్కడంతో లంక జట్టుకు భారీ స్కోరు దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజే ఐదు వికెట్లు కోల్పోయి శ్రీలంక తడబడగా.. ఈ జోడీ 6 వికెట్‌కు 173 పరుగులు జోడించింది. ధనంజయ అవుటైనా ఒంటరి పోరాటం చేసిన మెండిస్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 92 పరుగులు కలుపుకుని శ్రీలంక.. బంగ్లా ముందు 511 పరుగుల టార్గెట్ పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 280 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 188 స్కోరుకే పరిమితమైన విషయం తెలిసిందే. మూడో రోజు చివర్లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా తడబడింది. విశ్వ ఫెర్నండో(3/13) ధాటికి ఆ జట్టు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. మహ్మదుల్ హసన్ జాయ్(0), జాకీర్ హసన్(19), కెప్టెన్ శాంటో(6), లిటాన్ దాస్(0), షాహదత్ హుస్సేన్(0) దారుణంగా విఫలమయ్యారు. మోమినుల్ హక్(7), తైజుల్ ఇస్లామ్(6) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో 47/5 స్కోరు చేసిన ఆ జట్టు.. ఇంకా 464 పరుగులు వెనుకబడి ఉంది. బంగ్లా ఓటమి నుంచి బయటపడటం అసాధమ్యే. సోమవారం తొలి సెషన్‌లోనే శ్రీలంక విజయం ఖాయం కావొచ్చు.

Advertisement

Next Story

Most Viewed