రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ రద్దు

by Harish |
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ రద్దు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పూనియాకు విధించిన తాత్కాలిక నిషేధాన్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) క్రమశిక్షణ ప్యానెల్(ఏడీడీపీ) రద్దు చేసింది. సోమవారం విచారణ చేపట్టిన ఏడీడీపీ అథ్లెట్‌కు నాడా ‘నోటీసు ఆఫ్ చార్జ్’ ఇచ్చే వరకు అతనిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ‘అథ్లెట్‌పై మోపిన అభియోగాలను పేర్కొంటూ నాడా ఇంకా నోటీసు జారీ చేయలేదు. కాబట్టి, విచారణ ప్యానెల్ లోతైన విచారణకు వెళ్లడం లేదు. 2021 యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం.. అధికారికంగా నోటీస్ ఆఫ్ చార్జ్‌ను జారీ చేయాలని నాడా నిర్ణయించే వరకు అథ్లెట్‌పై తాత్కాలిక నిషేధాన్ని రద్దు చేస్తున్నాం.’ అని ఏడీడీపీ పేర్కొంది. కాగా, మార్చిలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌ సందర్భంగా డోప్ టెస్టుకు యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించాడనే కారణంతో నాడా ఏప్రిల్‌లో బజరంగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్‌‌ను బజరంగ్ సవాల్ చేశాడు. ఏడీడీపీ విచారణలో తాను శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించలేదని, గతేడాది డిసెంబర్‌లో తనకు గడువు ముగిసిన కిట్‌లు ఇవ్వడంపైనే నాడాను సమాధానం కోరానని తెలిపాడు. ఏడీడీపీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, బజరంగ్ పోటీ ఈవెంట్లలో పాల్గొనచ్చని అతని తరపు న్యాయవాది తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed