తొలి వన్డే ఆసిస్‌దే.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

by Harish |
తొలి వన్డే ఆసిస్‌దే.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన కరేబియన్ జట్టు‌ను ఆతిథ్య బౌలర్లు మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. విండీస్ 48.4 ఓవర్లలో 231 పరుగులు చేసి ఆలౌటైంది. కీసీ కార్టీ(88), రోస్టన్ చేస్(59) రాణించగా.. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అరంగేట్ర పేసర్ బార్ట్‌లెట్ 4 వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అబ్బాట్, గ్రీన్ రెండేసి వికెట్లతో రాణించారు. అనంతరం 232 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. 38.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(4) తొలి ఓవర్‌లో వికెట్ పారేసుకోవడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(65), గ్రీన్(77 నాటౌట్), కెప్టెన్ స్మిత్(79 నాటౌట్) రాణించడంతో ఆసిస్ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. దీంతో వన్డే సిరీస్‌లో కంగారుల జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రెండో వన్డే జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed