చిక్కుల్లో భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్..

by Vinod kumar |
చిక్కుల్లో భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్..
X

న్యూఢిల్లీ : భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ చిక్కుల్లో పడ్డాడు. గతేడాది ఆసియా కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లకు జట్టు ఎంపికలో అతను జ్యోతిష్యుడి సలహాలు తీసుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆసియా గేమ్స్ ప్రారంభానికి ముందు ఈ వార్తలు భారత ఫుట్‌బాల్‌లో కలకలం రేపుతున్నాయి. భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక విషయంలో హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఢిల్లీకి చెందిన జ్యోతిష్యుడు భూపేశ్ శర్మ సలహాలు పాటించారని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అంతేకాకుండా, వారి మధ్య జరిగిన చాట్‌ను కూడా బయటపెట్టింది.

సదరు మీడియా సంస్థ కథనం ప్రకారం.. గతేడాది మే-జూన్ మధ్య స్టిమాక్, భూపేశ్ శర్మ మధ్య వందకుపైగా మెసేజ్‌లు ఎక్స్చేంజ్ అయ్యాయి. ఈ సమయంలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. జోర్డాన్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌తోపాటు గతేడాది ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లతో తలపడింది. ప్రతి మ్యాచ్‌కు ముందు కోచ్ ఇగోర్ స్టిమాక్.. భూపేశ్ శర్మతో టచ్‌లో ఉన్నాడు. జట్టు వివరాలతోపాటు ప్లేయర్ల ఫిట్‌నెస్, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన స్థలం వంటి వివరాలను భూపేశ్ శర్మకు పంపించి.. ఎవరిని ఎంపిక చేయాలి? వంటి వివరాలను అడిగి తెలుసుకునేవాడు.

జ్యోతిష్యుడి సలహాల మేరకు స్టిమాక్ జట్టు కూర్పు చేసేవాడని సదరు మీడియా సంస్థ పేర్కొంది. అలాగే, స్టిమాక్‌కు భూపేశ్ శర్మను తానే పరిచయం చేసినట్టు అప్పటి జనరల్ సెక్రెటరీ కుశాల్ దాస్ అంగీకరించినట్టు తెలిపింది. ‘సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆటగాళ్ల ప్రస్తుత దశ, జ్యోత్యిష్య సమయాలు వంటివి భూపేశ్ శర్మ మాకు అందించారు. రెండు నెలలు మాకు సహకారం అందించినందుకు రూ. 12-15 లక్షలు చెల్లించాం.’ అని కుశాల్ దాస్ చెప్పినట్టు కథనంలో పేర్కొంది. ఆసియా కప్‌కు ముందు ఈ వార్తలు భారత ఫుట్‌బాల్‌ను కుదిపేస్తున్నాయి. కీలకమైన జట్టు వివరాలను బయటి వ్యక్తితో పంచుకోవడం ద్వారా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది. దాంతో జట్టు ఎంపిక సమగ్రతపై, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) మేనేజ్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed