Asia Cup 2023: టీమిండియా క్రికెటర్ల జెర్సీపై పాకిస్తాన్ పేరు.. ఎందుకంటే?

by Vinod kumar |   ( Updated:2023-08-10 12:25:33.0  )
Asia Cup 2023: టీమిండియా క్రికెటర్ల జెర్సీపై పాకిస్తాన్ పేరు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే అంత వైరం ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్న ఇరు దేశాలు.. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం 13 ఏళ్ల క్రితమే మానేసాయి. దాంతో భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాలే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్-పాక్ మ్యాచ్ జరిగితే ఇరు దేశాల అభిమానులు టీవీలకే అతుక్కుపోతారు. విజయం సాధిస్తే ప్రపంచాన్నే జయించినంత సంతోషపడుతారు. అలాంటి మ్యాచ్‌కు ఆసియాకప్ 2023 వేదికగా కానుండగా.. టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ అని రాసి ఉన్న జెర్సీలను ధరించనున్నారు.

ఇప్పటికే ఆసియాకప్‌కు సంబంధించిన ఫొటో సెషన్ పూర్తవ్వగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాకప్ ఆడే ఆయా దేశాల జెర్సీలపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేరుతో పాటు ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ పేరు ఉండనుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లీగ్ దశలోనే రెండు సార్లు పాకిస్థాన్‌తో తలపడనుంది. ఒక వేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే మూడో సారి ఆడనున్నాయి. ఈ టోర్నీలో భాగంగా ఆగస్ట్ 30న ముల్తాన్ వేదికగా నేపాల్‌తో పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్‌ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు నేపాల్ పోటీ పడనుండగా.. గ్రూప్ బీలో శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి. సెప్టెంబర్ 2 పల్లెకెల వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed