అశ్విన్, హర్షిత్ రాణా ఔట్? బ్రిస్బేన్ టెస్ట్‌కు ఆ ముగ్గురిలో ఇద్దరికి చాన్స్!

by Sathputhe Rajesh |
అశ్విన్, హర్షిత్ రాణా ఔట్? బ్రిస్బేన్ టెస్ట్‌కు ఆ ముగ్గురిలో ఇద్దరికి చాన్స్!
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో ఇక అందరి దృష్టి గబ్బా టెస్ట్‌పై పడింది. ఈ టెస్ట్‌లో బ్యాటింగ్ కాంబినేషన్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఏమీ లేకున్నా.. బౌలర్ల విషయంలో మాత్రం రెండు మార్పులు చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తుది జట్టుపై సీనియర్లు ఎవరికీవారు అంచనాలు వేస్తున్న వేళ రోహిత్ శర్మ జట్టు కూర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గబ్బా టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కనబెట్టనున్నట్లు సమాచారం. అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టగలిగే సామర్థ్యం ఉండటంతో సుందర్ వైపు రోహిత్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టులో తిరిగి స్థానం పొందిన తర్వాత సుందర్ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి రాణించాడు. మరోవైపు అశ్విన్ అడిలైడ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. పింక్ బాల్ టెస్ట్‌లో మంచి రికార్డు ఉందని అశ్విన్‌కు రెండో టెస్ట్‌లో చోటు కల్పించారు. కానీ అశ్విన్ మాత్రం అడిలైడ్‌లో కేవలం ఒకే వికెట్ తీసి తేలిపోయాడు. ఇటీవల ఆల్ రౌండర్‌గా స్థిరంగా రాణిస్తుండటంగా సుందర్‌కు తుదిజట్టులో బెర్త్ కన్ఫార్మ్ కానున్నట్లు తెలిసింది.

హర్షిత్ రాణా ప్లేస్‌లో ఆ ఇద్దరిలో ఒకరు..?

పెర్త్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు హర్షిత్ రాణా బౌలింగ్‌లో గ్రౌండ్ నలుమూలల పరుగులు రాబట్టారు. దీంతో హర్షిత్ రాణా ప్లేస్‌లో ఆకాశ్ దీప్, ముకేష్ కుమార్‌లకు గబ్బా టెస్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా హర్డ్ లెంత్ బౌలింగ్‌తో రాణిస్తుండగా ఆయనకు ఆకాశ్, ముకేష్‌ల నుంచి మద్దతు లభిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలిసింది. నితీశ్ రెడ్డి బౌలింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నా.. బ్యాట్స్‌మెన్‌గా కఠినమైన పరిస్థితుల్లో రాణించడంతో తెలుగు కుర్రాడిని తుదిజట్టులో కొనసాగించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story