IPL 2025 : గుజరాత్‌కు నెహ్రా టాటా?.. ప్రపంచకప్‌ విజేతతో ఫ్రాంచైజీ చర్చలు

by Harish |
IPL 2025 : గుజరాత్‌కు నెహ్రా టాటా?.. ప్రపంచకప్‌ విజేతతో ఫ్రాంచైజీ చర్చలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వచ్చే సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆ జట్టుకు టాటా చెప్పబోతున్నాడని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుజరాత్‌ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ గెలవడం, ఆ తర్వాతి సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరడంతో నెహ్రా మాస్టర్ మైండ్‌గా గుర్తింపు పొందాడు. అయితే, వచ్చే సీజన్‌లో గుజరాత్‌తో కొనసాగేందుకు నెహ్రా సిద్ధంగా లేడని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో విడిపోవాలని నెహ్రా నిర్ణయించుకున్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. నెహ్రా స్థానం కోసం ఫ్రాంచైజీ భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో కూడా చర్చలు జరిపినట్టు తెలిపింది.

‘ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి తప్పుకునే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏది నిర్ణయం కాలేదు. కానీ, గుజరాత్ టైటాన్స్ కోచింగ్ స్టాఫ్‌లో కొన్ని మేజర్ మార్పులు జరగనున్నాయి.’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నెహ్రాతోపాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా గుజరాత్‌ను వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. నెహ్రాగానీ, గుజరాత్ టైటాన్స్‌గానీ అధికారిక ప్రకటన ఇస్తేనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

కాగా, గుజరాత్ అరంగేట్ర సీజన్ 2022 నుంచి నెహ్రా ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. గతేడాది కూడా జట్టు ఫైనల్‌కు చేరింది. దీంతో ఐపీఎల్‌లో అతను మాస్టర్ మైండ్‌గా గుర్తింపు పొందాడు. అయితే, ఈ ఏడాది జట్టు పేలవ ప్రదర్శనతో 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed