ఆర్చరీ వరల్డ్ కప్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు ధీరజ్.. రెండు పతకాలు కైవసం

by Harish |
ఆర్చరీ వరల్డ్ కప్‌లో సత్తాచాటిన తెలుగు కుర్రాడు ధీరజ్.. రెండు పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : తెలుగు కుర్రాడు, భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు. తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ స్టేజ్-3‌లో రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఆదివారం రికర్వ్ వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో మెడల్స్ గెలుచుకున్నాడు. రికర్వ్ వ్యక్తిగత కేటగిరీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ధీరజ్ 7-3(28-27, 29-28, 27-28, 28-28, 30-29) తేడాతో మౌరో నెస్సోలి(ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ ఈవెంట్లలో వ్యక్తిగత కేటగిరీలో ధీరజ్‌కు ఇదే తొలి మెడల్. అంతకుముందు సెమీస్‌లో కిమ్ వూజిన్(సౌత్ కొరియా) చేతిలో 6-2 తేడాతో ఓడిపోయి ధీరజ్ స్వర్ణ పతక పోరుకు దూరమయ్యాడు.

ఇక, మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో మహిళా ఆర్చర్ భజన్ కౌర్‌‌తో కలిసి ధీరజ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ధీరజ్, భజన్ కౌర్ జట్టు 5-3 తేడాతో మెక్సికోకు చెందిన మాటియాస్ గ్రాండే-అలెజాండ్రా వాలెన్సియా ద్వయాన్ని ఓడించింది. మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో ధీరజ్‌కు రెండో కాంస్యం. చైనాలో జరిగిన స్టేజ్-1లో అంకితతో కలిసి తొలి మెడల్ సాధించాడు. తెలుగమ్మాయి జ్యోతి కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ ఈవెంట్‌లో పర్ణీత్, అదితితో కలిసి స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా భారత్ ఈ టోర్నీని నాలుగు పతకాలు(స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) ముగించింది.

Advertisement

Next Story

Most Viewed