న్యూజిలాండ్, అఫ్గాన్ ఏకైక టెస్టు రద్దు.. 91 ఏళ్లలో ఇదే తొలిసారి

by Harish |
న్యూజిలాండ్, అఫ్గాన్ ఏకైక టెస్టు రద్దు.. 91 ఏళ్లలో ఇదే తొలిసారి
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ జట్లకు తీవ్ర నిరాశ. గ్రేటర్ నోయిడా వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు వర్షార్పణమైంది. చివరి రోజు కూడా వర్షం పడటంతో అంపైర్లు శుక్రవారం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోవడం గమనార్హం. ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన మ్యాచ్ భారీ వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా మారింది. గ్రౌండ్ సిబ్బంది శ్రమించినా మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో తొలి రోజు ఆట సాధ్యపడలేదు.

స్టేడియంలో మౌళిక సదుపాయాలు లేకపోవడంతో మ్యాచ్ నిర్వహణపై విమర్శలు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సిద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు నుంచి వర్షం కురవడంతో ఆట రద్దవుతూ వచ్చింది. చివరి రోజైన శుక్రవారం కూడా వరుణుడు కరుణించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ కూడా పడకుండా మ్యాచ్ ముగియడంతో టెస్టు క్రికెట్‌లో గ్రేటర్ నోయిడా చెత్త రికార్డును మూటగట్టుకుంది.

1933 నుంచి భారత్ సుదీర్ఘ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నది. 91 ఏళ్లలో కనీసం ఒక్క బంతి కూడా పడకుండా ఓ టెస్టు మ్యాచ్ రద్దవడం భారత్‌లో ఇదే తొలిసారి. ఆసియాలో ఇది రెండోసారి. 1998లో పాక్ వేదికగా పాక్, జింబాబ్వే మధ్య జరిగిన మూడో టెస్టు బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా టెస్టు క్రికెట్‌లో ఇది 8వసారి మ్యాచ్. 1998లో భారత్, న్యూజిలాండ్ టెస్టు కూడా ఆగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed