టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా అమ్మాయిలు సంచలనం

by Vinod kumar |
టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా అమ్మాయిలు సంచలనం
X

న్యూఢిల్లీ : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా మహిళా క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో 250 స్కోరు చేస్తేనే వామ్మో అంటాం. అలాంటిది అర్జెంటీనా మహిళా జట్టు ఏకంగా 427/1 స్కోరు చేసింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఈ భారీ స్కోరు చేయడం గమనార్హం. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. పురుషుల విభాగంలోనూ ఇదే హయ్యెస్ట్ స్కోరు. ఇంతకుముందు గతేడాది సౌదీ అరేబియాపై బహ్రెయిన్ మహిళల జట్టు చేసిన 318/2 స్కోరు హయ్యెస్ట్ స్కోరు రికార్డు కలిగి ఉండగా దాన్ని అర్జెంటీనా బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్ శుక్రవారం జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆతిథ్య చిలీ జట్టుతో జరిగిన తొలి టీ20లో అర్జెంటీనా 364 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా నిర్ణీత 20 ఓవర్లలో 427/1 స్కోరు చేసింది. సెంచరీతో రెచ్చిపోయిన ఓపెనర్ లూసియా టేలర్(169, 84 బంతుల్లో 27 ఫోర్లు) టీ20ల్లో వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోరును నమోదు చేసింది.

అలాగే, మరో ఓపెనర్ అల్బెర్టినా గలాన్(145 నాటౌట్, 84 బంతుల్లో 23 ఫోర్లు) సైతం సెంచరీతో చెలరేగింది. 427 పరుగుల అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌తో చిలీ జట్టు పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. చిలీ బౌలర్లు 73 అదనపు పరుగులు ఇవ్వగా.. అందులో 64 నోబాల్స్ ఉండటం గమనార్హం. అలాగే, బౌలర్ ఫ్లోరెన్సియా మార్టినెజ్ ఒకే ఓవర్‌లో 52 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ ఓవర్‌లో ఆమె ఏకంగా 17 నో బాల్స్ వేసింది. అనంతరం ఛేదనకు దిగిన చిలీని అర్జెంటీనా బౌలర్లు 63 పరుగులకే ఆలౌట్ చేశారు.

చిలీ బ్యాటింగ్ లైనప్‌లో జెస్సికా మిరాండ(27) టాప్ స్కోరర్. ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఐదుగురు ఖాతా కూడా తెరవలేదు. శనివారం జరిగిన రెండో టీ20లోనూ మరియా కాస్టినీరాస్(105) సెంచరీతో చెలరేగడంతో అర్జెంటీనా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 300 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో చిలీ 19 పరుగుల ఆలౌటవడంతో అర్జెంటీనా 281 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాకుండా, మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది.

Advertisement

Next Story