Paris Olympics : మను బాకర్‌కు హ్యాట్రిక్ మెడల్ చాన్స్.. మరి ఆ ఈవెంట్‌లో సత్తాచాటుతుందా?

by Harish |
Paris Olympics : మను బాకర్‌కు హ్యాట్రిక్ మెడల్ చాన్స్.. మరి ఆ ఈవెంట్‌లో సత్తాచాటుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ విశ్వక్రీడల్లో స్టార్ షూటర్ మను బాకర్ అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు కాంస్య పతకాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత కేటగిరీలో తొలి పతకం గెలిచింది. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా కొత్త చరిత్రనే సృష్టించింది.

అయితే, ఈ ఒలింపిక్స్‌లో ఆమె మూడో మెడల్ గెలిచే అవకాశం కూడా ఉంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ మను పాల్గొంటుంది. ఆగస్టు 2న క్వాలిఫికేషన్ రౌండ్, 3వ తేదీన ఫైనల్ జరగనుంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించి మను ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో 25 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లోనూ ఆమెపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆమె జోరు చూస్తుంటే ఈ ఈవెంట్‌లో పతకం రంగు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

25 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లోనూ మనుకు మంచి రికార్డే ఉంది. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల్లో 25 మీటర్ల పిస్టోల్ టీమ్ స్వర్ణ పతకం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అలాగే, గతేడాది బోపాల్‌లో జరిగిన షూటింగ్ వరల్డ్ కప్‌లో ఆమె వ్యక్తిగత కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంతేకాకుండా, 2021లో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో జట్టు గోల్డ్ మెడల్ సాధించడంలో ఆమెదే కీలక భూమిక. అదే టోర్నీలో వ్యక్తిగతంగా కాంస్య పతకం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed